నేటికాలంలో అవినీతి సొమ్ము కోసం ఆరాటపడేవాలు ఎక్కువ అయ్యారు. అలానే చాలా మందిలో నిజాయితీ అనేది కనుమరుగైంది. అందుకే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ డబ్బులు నొక్కేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటివి కొన్ని షాపులు, హోటళ్లలో ఇతర దుకాణాల్లో జరుగుతుంటాయి. అయితే ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే లో కూడా ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. బాటిల్స్, ఆహార పదార్ధాలపై రైల్వే శాఖ నిర్ణయించిన ధరకంటే ఎక్కువకు కొందరు అమ్ముతుంటారు. ఇలాంటి అదనపు వసూలపై కొందరు పౌరులు పోరాడి.. అలాంటి వారికి తగిన గుణ పాఠం చెప్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన ఓ ప్రయాణికుడు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైతే.. సదరు రైల్వే కాంట్రాక్టర్ కు గుణపాఠం నేర్పాడు. వాటర్ బాటిల్ పై రూ.5 అదనంగా వసూలు చేసినందుకు ఆ కాంట్రాక్టర్ కు లక్ష రూపాయలు జరిమానా విధించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హర్యానాకు చెందిన శివం భట్ అనే ప్రయాణికుడు ఇటీవల లక్నో ఎక్స్ ప్రెస్ లో చండీఘర్ నుంచి షాజహాన్ పూర్ కు వెళ్తున్నాడు. అయితే రైలు ప్రయాణం మధ్యలో శివంకు దాహం వేయడంతో వాటర్ బాటిల్ తీసుకోవాలనుకున్నాడు. ఇదే సమయంలో అటుగా వచ్చిన వ్యక్తి బాటిల్ పై ఎమ్ఆర్పీ రూ.15 ఉండగా.. రూ.20 కి అమ్ముతున్నాడు. అదే విషయాన్ని శివం గుర్తించి.. ఎందుకు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు అంటూ విక్రయించే వారిని ప్రశ్నించాడు. కావాలంటే తీసుకో, లేదంటే లేదు అన్నట్లు విక్రయించే వ్యక్తి సమాధానం ఇచ్చాడు. అయితే మరో దారిలేక అడినంతా ఇచ్చి శివం భట్ నీళ్ల బాటిల్ ను కొనుగోలు చేశాడు. అయితే ఈ వ్యవహారాన్ని మొత్తం మూడో కంటికి తెలియకుండా వీడియో తీశాడు.
అంతటితో ఊరుకోక ఆ వీడియోను రైల్వే ఉన్నతాధికారులకు పంపించాడు. అంతేకాక సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయింది. అయితే ఈ ఘటనపై రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. లక్నో ఎక్స్ ప్రెస్ రైల్లో నీళ్ల బాటిళ్ల అమ్మకానికి లైసెన్స్ పొందిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకున్నారు. బాటిల్ పై ఉన్న ధర కన్న ఎక్కువ ధరకు అమ్ముతున్నందుకు రూ.లక్ష జరిమానా విధించారు. దీంతో రూ.5 అదనంగా వసూలు చేసినందుకు.. లక్ష రూపాయలు జరిమానా పడింది. అలా శివం అనే ప్రయాణికుడు సదరు కాంట్రాక్టర్ కు తగిన గుణపాఠం చెప్పాడు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.