పోలీస్ అంటే రక్షణ కల్పించేవారు.. కానీ ఇటీవల పలు సందర్భాల్లో పోలీసులు చేస్తున్న చర్యలపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. కానీ ఓ పోలీస్ చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పోలీస్ అంటే శాంతి భద్రతలను ఎల్లప్పుడు సంరక్షిస్తూ.. ప్రజల జీవితాలకు, ఆస్తులకు రక్షణ కల్పిసూ.. ఎక్కడ కూడా విధ్వంసాలు జరగకుండా కాపాడేందుకు ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. చట్టాన్ని కాపాడే క్రమంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుంటారు.. అందువల కొంతమంది పోలీసులు అంటే భయంతో వణికిపోతుంటారు. కానీ పోలీసుల్లో కూడా మానవత్వం దాగి ఉందని.. ప్రజలను రక్షించేందుకు ఎంతటి సాహసాలైనా చేస్తారని పలు సందర్భాల్లో రుజువు చేశారు. ఓ పోలీస్ తన ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్నవారిని రక్షించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ లో బాద్షహినాకా ప్రాంతంలో ఓ మూడంతస్తుల భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు క్రమంగా మూడో అంతస్తులోకి వ్యాపించాయి. వెంటనే విషయాన్ని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాకప సిబ్బంది మంటల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను కాపాడారు. అయితే మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న గుప్తా అనే వ్యక్తి కుటుంబం మంటల్లో చిక్కుకున్నారని కొంతమంది అనుమానం వ్యక్తం చేయడంతో పోలీస్ అధికారి అంకిత్ ఖాతానా తన ప్రాణాలకు తెగించి కాపాడే ప్రయత్నం చేశారు.
ఓ వైపు మంటలు వ్యాపించి పోగలు దట్టంగా అలుముకున్నాయి. అంకిత్ ఖాతానా పక్కనే ఉన్న మరో భవనంపైకి ఎక్కి మంటలు వ్యాపించి ఉన్న మూడో అంతస్తులోకి ఇంటి కిటికీ అద్దాలు తన బూటు కాలుతో తన్ని లోపలికి ప్రవేశించారు. అయితే అక్కడ గుప్తా ఫ్యామిలీ ఎవరూ లేరని గమనించి అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్ ని బయటకు తీశాడు. దీంతో భారీ పేలుడు జరగకుండా చాకచ్యంగా వ్యవహరించాడు అంకిత్ ఖాతానా. ఓ వైపు మంటలు వస్తున్నా.. తన ప్రాణాలు ఏమాత్రం లేక్కచేయకుండా లోనికి వెళ్లి ప్రమాదం జరగకుండా చూసిన అంకిత్ సాహసాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆయన ధైర్యసాహసాలను అందరూ ప్రశంసిస్తున్నారు.