తోడికోడళ్లు అంటే కలిసి ఉండకూడదు, ఎప్పుడూ తిట్టుకుంటూ ఉండాలి, కుదిరితే కలబడి కొట్టేసుకోవాలి అని చెప్పి చాలా మంది కొన్ని వందల, వేల లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. ఇలాంటి సన్నివేశాలు ఇద్దరు అన్నదమ్ములు ఉన్న ఇళ్లలో ముఖ్యంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథల్లో ఎక్కువగా కనబడతాయి అని వాళ్ళూ, వీళ్లూ చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. తోడికోడళ్లు 5 నిమిషాలు మాట్లాడుకుంటే.. ఆరో నిమిషంలో పోట్లాడుకుంటారనే ప్రచారం ఉంది. గట్టిగా 10 నిమిషాలు కలిసి ఉండలేని తోడికోడళ్లు.. ఏకంగా 11 ఏళ్ళు కలిసి ఉన్నారంటే గొప్ప విషయమే. కలిసి ఉండడమే కాదు, కలిసి వ్యాపారం కూడా చేస్తున్నారు. బిజినెస్ అంటే మళ్ళీ అల్లాటప్పా యాపారం అనుకునేరు. ఏడాదికి రూ. 600 కోట్లు టర్నోవర్ చేసే బిజినెస్ చేస్తున్నారు.
రికా జైన్, కిమి జైన్ ఇద్దరూ తోడికోడళ్లు. 2012లో ప్రీమియం హోటల్ టాయిలెట్రీ అంటే టాయిలెట్ లో ఉపయోగించే సబ్బులు, షాంపూలు, టూత్ పేస్టులు, హెయిర్ కండిషనర్లు, టాయిలెట్ పేపర్లు వంటివి తయారు చేసే కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ పేరు కిమిరికా. కంపెనీ స్టార్ట్ చేసిన ఆనతి కాలంలోనే వార్షిక ఆదాయం రూ.600 కోట్లకు చేరింది. వీరికి కెనడాకు చెందిన హాస్పిటాలిటీ ఉత్పత్తుల తయారీ సంస్థలో కూడా భాగస్వామ్యం ఉంది. ఒకసారి రికా జైన్ తన భర్త రజత్ జైన్ తో కలిసి ఓ హోటల్ కు వెళ్లారు. ఆ సమయంలో హోటల్ గదిలోని టాయిలెట్రీ వస్తువులను ఆమె గమనించారు. ఆ వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుసుకున్న రికా జైన్.. వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. తన నిర్ణయాన్ని తన తోటి కోడలు కిమి జైన్, ఆమె భర్త మోహిత్ జైన్ తో చెప్పి ఒప్పించారు. అలా టాయిలెట్రీ వ్యాపారాన్ని ప్రారంభించారు. కిమిరికా హంటర్ ఇంటర్నేషనల్, కిమిరికా లైఫ్ స్టైల్ వ్యాపారాలు చేస్తూ.. రూ. 600 కోట్లు టర్నోవర్ చేస్తున్నారు.
కిమి జైన్ మధ్యప్రదేశ్ లో జన్మించారు. ఈ-కామర్స్ లో ఎంబీఏ పూర్తి చేసిన కిమి.. మోహిత్ జైన్ ను వివాహం చేసుకున్నారు. ఇక రికా జైన్ ఇండోర్ లోనే పుట్టి పెరిగారు. ఫార్మసీ పూర్తి చేసిన ఈమె రజత్ జైన్ ను వివాహం చేసుకున్నారు. మోహిత్, రజత్ లిద్దరూ సోదరులు. కిమి జైన్, రికా జైన్ లు పెట్టిన కిమిరికా కంపెనీలో 600 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది మహిళలే ఉండడం విశేషం. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా వ్యాపారం సాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆఫ్ లైన్ స్టోర్ల ద్వారా తమ ఉత్పత్తులను విక్రయించాలని భావిస్తున్నారు. కంపెనీ స్టార్ట్ చేసిన మొదటి ఆరు నెలలూ 2500 వినియోగదారులు మాత్రమే ఉండేవారు. దీంతో కంపెనీ కొనసాగించాలా? వద్దా? అన్న సమయంలో డైలమాలో పడ్డారు.
లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ అమ్మకాలకు ప్రోత్సాహం రావడంతో వీరికి ఊరట లభించింది. మరింత కష్టపడి ఈ వ్యాపారంపైనే దృష్టిని కేంద్రీకరించి విజయాన్ని సాధించారు. ఈరోజుల్లో సొంత అక్కాచెల్లెళ్ళే కలిసి ఉండే పరిస్థితి లేదు. అలాంటిది సొంత అక్కాచెల్లెళ్లకే అసూయ పుట్టేలా ఇద్దరు తోడికోడళ్లు కలిసి ఉండడం అంటే మామూలు విషయం కాదు. అభిప్రాయబేధాలు రాకుండా కుటుంబాన్ని నడపడమే కష్టం అనుకుంటే.. 600 మంది పని చేసే 600 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీని రన్ చేస్తున్నారంటే తోడికోడళ్లకు ఎంత ఓపిక, సహనం ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ తోడికోడళ్లపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.