సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు తాము గెలిచేందుకు రక రకాల వాగ్ధానాలు చేస్తుంటారు. ఇక ప్రచార సమయాల్లో ఎన్ని రకాల ఫీట్లు చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ నాయకుడి దర్శనం ఎప్పుడు కలుగుతుందో చెప్పడం కష్టం. తమకు ఏదైనా కష్టం వచ్చిందని వెళ్లినా ఆ నాయకుడి అనుచరులను దాటుకొని పోవడం మహా కష్టం. కానీ కొంత మంది నేతలు మాత్రం తాము ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఎంతో కృషి చేస్తారు.. నిత్యం తమ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటారు. అలాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు.
ఈ రోజు (శనివారం) మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పుట్టినరోజు. ఆయన తన పుట్టిన రోజు వేడుకలను పారిశుధ్య కార్మికులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు స్వీపర్లకు కాళ్లు కడిగి సీఎం సన్మానించారు. అంతే కాదు వారికి స్టార్ రేటింగ్ ప్రకారం వార్షిక భత్యం, నెలకు రూ.150 రిస్క్ అలవెన్స్ కూడా ప్రకటించారు. పారిశుధ్య కార్మికుల సేవాభావం అభినందనీయమని సీఎం అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 7 స్టార్ రేటింగ్ పొందిన నగరాల్లో పారిశుద్ధ్య కార్మికులకు రూ.7 వేల సమ్మాన్ నిధిని అందజేస్తామని ఆయన ప్రకటించారు. అదేవిధంగా, 5-స్టార్ రేటింగ్ ఉన్న నగరాల్లో, పారిశుధ్య కార్మికులకు 5 వేలరూపాయల సమ్మాన్ నిధి ఇవ్వనున్నట్లు తెలిపారు.