ఉన్నత విద్య ఉన్నా సరైన ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులుగా మిగులుతున్నారు. కొంత మంది నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంత మంది స్వయం ఉపాధితో తమ కాళ్లమీద తాము నిలబడుతున్నారు. తాజాగా వారణాసిలోని అస్సీ ఘాట్ ప్రాంతంలో ఒక మహిళ బిక్షం ఎత్తుకొని జీవిస్తుంది. ఆమె ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంది.. ఆ మహిళకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.
రోడ్డుపై యాచకురాలిగా కనిపించిన స్వాతిని బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)కి చెందిన శారదా అవనీష్ త్రిపాఠి అనే విద్యార్థి పలకరించారు. ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడే విధానం చూసి నివ్వెరపోయాడు. ఆమె పేరు స్వాతి అని దక్షిణ భారతదేశానికి చెందిన ఆమె కంప్యూటర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు చెబుతుంది. తాను బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సగం శరీరం చచ్చుబడిపోయిందని, మూడేళ్ల క్రితం వారణాసికి వచ్చానని స్వాతి తెలిపింది. తనకు ఏదైనా జాబ్ ఇస్తే చేస్తానని.. ఈ విషయం అందరికీ చెప్పాలని కోరింది. ఆమె కష్టాలన్నీ తెలుసుకొని తన ఫేస్‌బుక్‌లో వీడియోను షేర్ చేశారు శారదా అవనీష్ త్రిపాఠి.
ఈ సందర్భంగా శారదా అవనీష్ త్రిపాఠి మాట్లాడుతూ.. స్వాతి మానసికంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉంది, కానీ వీధుల్లో జీవించాల్సి వస్తుంది. ఆమె నా నుండి డబ్బు తీసుకోలేదు కానీ ఆమెకు ఏదైనా పని ఇప్పించమని నన్ను కోరింది. తాను కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయినందున ఉద్యోగం పొందడానికి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని అభ్యర్థించింది. ఎవరైనా స్పందించి ఆమెకు ఉద్యోగవకాశం కల్పించి గొప్ప మనసు చాటుకోవాలని కోరుతున్నానని అన్నారు. నిజంగా యాచకురాలిగా మారిన స్వాతి దీనావస్థ చూస్తుంటే ఎవరి మనసు అయినా చలించిపోతుంది.