అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారుసు చేసినట్లు వస్తున్న మీడియా కథనాలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ విచారం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ చాలా పవిత్ర మైందని మీడియా మిత్రులు గుర్తించాలని వ్యాఖ్యానించారు. ప్రక్రియ కొనసాగుతోందని, ఇలాంటి సీరియస్ అంశాలపై ఊహాజనిత కథనాలు రావడం దురదృష్టకరం అన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ సిన్హా వీడ్కోలు కార్యక్రమంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సుప్రీంకోర్టులో జడ్జిల నియామకానికి సంబంధించిన కొలీజియం సమావేశంపై ఊహాజనిత కథనాలు రావడం దురదృష్టకరం. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇది చాలా పవిత్రమైన ప్రక్రియ, ఎంతో గౌరవంతో కూడుకున్నది. మీడియా మిత్రులు దీనిని గుర్తించి, అర్థం చేసుకోవాలి. ప్రక్రియ పూర్తికాకముందే కథనాలు రావడం ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి ఊహాగానాల వల్ల కొందరి కెరీర్లు దెబ్బతింటాయి. ఈ పరిణామాలపై నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా’ వ్యాఖ్యానించారు.
సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం ముగ్గురు మహిళా న్యాయమూర్తులు సహా 9 మంది పేర్లను సిఫారసు చేసిందని.. కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ బి.వి.నాగరత్న భారత తొలి ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉందని.. కేంద్రం ఆమె పేరును గనుక ఆమోదిస్తే 2027లో ఆమె భారత తొలి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.