ఓ 10 రోజులు సెలవులు కావాలంటే సరైన రీజన్ ఉండాల్సిందే. జ్వరమో, ఏదైనా టూరో, లేదంటే ఎవరైనా చనిపోతే.. ఎక్కువ రోజుల పాటు సెలవులు తీసుకుంటాం. దీని కోసం మన పై అధికారులకు లీవ్ లెటర్ పెడతాం. కానీ ఆ వ్యక్తి పెట్టిన సెలవు చీటి మాత్రం నవ్వు తెప్పిస్తుందీ.. ఇంతకు ఆయన లీవ్ కోసం ఏం దరఖాస్తు చేశారంటే..?
ఆఫీసుకు సెలవు కావాలంటే ఏం చేస్తాం.. ఒక రోజైతే బాస్‌కి చెబుతాం. కానీ ఓ పది రోజులు కావాలంటే కచ్చితంగా లీవ్ లెటర్ రాయాల్సిందే. జ్వరమో, ఇతర అనారోగ్య సమస్యలైతే సవివరంగా రాస్తాం. లేదంటే ఎవరైనా ఇంట్లోని వారో, బంధువులో కాలం చేస్తే సెలవులు తీసుకుంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి ఓ పెద్ద కష్టమే వచ్చిందండోయ్. ఆయన భార్య అలిగింది. ఈ విషయమే తెలియజేస్తూ.. తన భార్యను అలక పాన్పు నుండి దింపేందుకు ఏకంగా 10 రోజులు సెలవులు కావాలంటూ.. సదరు వ్యక్తి తన పై అధికారికి లేఖ రాశారు. ఇంతకూ రాసిందో ఎవరో తెలుసా.. ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్. 24/7 విధులు నిర్వర్తించే రక్షకభటులకు మాత్రం సెలవులు దొరకడం కష్టమే మరీ.
ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లో జరిగిందీ ఈ ఘటన. హోలీ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్ శాఖ.. పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. అదే సమయంలో ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్.. ఎస్సైకి రాసిన లేఖ వైరల్‌గా మారింది. ‘మా ఆవిడ అలిగింది. ఆమెను శాంతింప జేయాలంటే 10 రోజుల లీవ్ ఇవ్వండి’ అంటూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఇన్‌ఛార్జ్ అశోక్ కుమార్, పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ మీనాకు చేసిన దరఖాస్తులో ఇలా పేర్కొన్నాడు. పెళ్లయిన 22 ఏళ్ల నుంచి తన భార్యను హోలీ సందర్భంగా ఆమె పుట్టింటికి తీసుకెళ్లలేకపోయానని, దీని కారణంగా ఆమె తనపై అలిగిందని అందులో పేర్కొన్నారు.
ఈ ఏడాదైనా హోలీకి తీసుకెళ్లమని తన భార్య అడిగిందని, అయితే సెలవులు లేవని చెప్పడంతో భార్య తనపై కోపంగా ఉందని, ఆమెను బుజ్జగించి, పుట్టింటికి తీసుకెళ్లేందుకు ఈ నెల 4 నుండి 10 రోజుల పాటు సెలవులు మంజూరు చేయాలని కోరుతున్నట్లు సెలవు చీటిలో పేర్కొన్నాడు. ఈ లీవ్ లెటర్‌ను చదివిన అశోక్ కుమార్ మీనా నవ్వుకుని, సదరు ఇన్‌స్పెక్టర్‌కు ఐదు రోజుల సెలవులను ఆమోదించారు. దీనిపై పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ మీనా మాట్లాడుతూ, సమస్యను దృష్టిలో ఉంచుకుని ఆయనకు ఐదు రోజుల సెలవులు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.