ఈ మద్య మనిషి చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ కి గురి కావడం.. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడటం చూస్తున్నాం. కొన్ని సమయాల్లో ఎదుటి వారి ప్రాణాలు సైతం తీస్తున్నారు. చికెన్ కోసం జరిగిన చిన్న గొడవ పెద్దది కావడంతో రెండు వర్గాలు రాళ్లతో దాడులు చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ అలీగఢ్ లో సోమవారం రాత్రి కొంత మంది యువకులు చికెన్ షాప్ కి వెళ్లారు. ఆ సమయంలో చికెన్ షాప్ యజమనికి యువకులకు వాగ్వాదం చోటు చేసుకుంది.. ఆ గొడవ పెద్దది మారి పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ స్థానికులు భయంతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తమ బలగాలతో అక్కడికి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడి గొడవను సర్ధుమణిగేలా చూశారు.
చికెన్ యజమానితో యువకులకు చిన్న విషయంపై గొడవ జరిగిందని.. విచక్షణ కోల్పోయి ఇరు వర్గాలు గొడవకు దిగడంతో పలువురుకి తీవ్ర గాయాలు అయ్యాయని వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు తమకు అందలేదని.. అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని డీఐజీ దీపక్ కుమార్ తెలిపారు.