మనది పితృస్వామ్య వ్వవస్థ. నేటి రాకేట్ యుగంలో కూడా మన సమాజంలో ఇదే కొనసాగుతుంది. చేసే పని తప్పైనా ఒప్పైనా సరే.. మగాళ్లకే సమాజం అండగా నిలబడుతుంది. మరీ ముఖ్యంగా రెండో వివాహం విషయంలో మగవారికి ఉన్నన్ని అవకాశాలు మహిళలకు ఉండవు. భార్య చనిపోయినా.. లేదంటే విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మగాడి మీద సమాజం విపరీతైమన సానుభూతి కనబరుస్తుంది. పాపం ఒక్కడే ఒంటరిగా ఎలా ఉంటాడు.. మరో పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టి మరీ రెండో వివాహం చేస్తారు. అదే పరిస్థితి మహిళలకు ఎదురైతే.. తలరాత.. ఇంతే రాసి పెట్టి ఉంది అని సర్దుకుపోవాలి.. ఇక జీవితాంతం ఒంటరిగానే బతకాలని తీర్మానిస్తారు. అయితే ఈ మధ్య కాలంలోనే ఈ ఆలోచనా ధోరణిలో కాస్త మార్పు వస్తోంది. మరో మంచి పరిణామం ఏంటంటే.. అత్తమామలే.. తల్లిదండ్రులై.. కొడలికి రెండో పెళ్లి చేసి కన్యాదానం చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఛత్తీస్‌గడ్ ధమ్‌తరీకి చెందిన మాజీ ఎంపీ చందూలాల్ సాహు కుమారుడికి పదేళ్ల క్రితం కళ్యాణి సాహు అనే మహిళతో వివాహం అయ్యింది. నాలుగేళ్ల పాటు వారి జీవితం సంతోషంగా సాగింది. ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో అనుకోని కుదుపు. వివాహం అయిన నాలుగేళ్లకు చందులాల్ కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటికి ఆ జంటకు ఏడాదిన్నర వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. భర్త మరణం తర్వాత కళ్యాణి సాహు కుమారుడితో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. పెళ్లైన నాలుగేళ్లకే కోడలికి ఇలాంటి కష్టం రావడంతో చందులాల్ ఎంతో బాధపడ్డాడు. ఒకవేళ కోడలి స్థానంలో తన కుమార్తె ఉంటే.. ఇలా వదలిసేవాడిని కాదు కదా.. తప్పకుండా రెండో వివాహం చేసేవాడిని అని అనుకున్నాడు.
మరి కళ్యాణి ఎందుకు ఇలా ఒంటిరిగా బాధపడాలి అని ఆలోచించిన చందులాల్ కోడలి కోసం సంబంధాలు చూడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో ధమ్‌తరీకి చెందిన డాక్టర్ వీరేంద్ర గంజీర్ గురించి చందులాల్‌కు తెలిసింది. వీరేంద్రకు కూడా గతంలో వివాహం అయ్యిందని.. భార్య గుండెపోటుతో మృతి చెండటంతో.. ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నాడని తెలుసుకున్నాడు. వారిద్దరిని ఒక్కటి చేసి.. కొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేయాలని భావించిన చందులాల్.. వీరేంద్రతో మాట్లాడి.. కోడలు కళ్యాణిని ఒప్పించి.. ఇద్దరికి పెళ్లి చేశాడు. ధమ్‌తరీలో వింధ్యవాసిని ఆలయంలో వీరి వివాహం జరిగింది. చందులాల్ చేసిన పనిపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీలాంటి వ్యక్తులు ఎందరికో ఆదర్శం అని ప్రశంసిస్తున్నారు.