రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బెగ్గర్స్ కనబడితే అసహ్యించుకుంటాం. చిరాకు పడతాం. ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని తిట్టుకుంటాం. వీళ్లకు ఎవరో ఒకరు పని ఇస్తే బాగుంటుంది. ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుంది అని అనుకుని వెళ్ళిపోతాం. కానీ ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా కొంతమంది డబ్బులు ఇస్తారు కానీ వారి బతుకులు మాత్రం మారవు. కానీ ఒక వ్యక్తి మాత్రం అడ్వాన్స్డ్ గా ఆలోచించారు. ప్రభుత్వాలు చేయనటువంటి పని చేసి యాచకుల జీవితాలను నిలబెడుతున్నారు. అలా అని అతని దగ్గర వేల కోట్ల ఆస్తులు లేవు. ఉన్నది ఒకటే మెదడు. ఆ తెలివితో అతను యాచకుల జీవితాలను మారుస్తున్నారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, వీధుల్లో యాచకులు ఎదురవుతుంటారు. ఎంతో కొంత సాయం చేయమని అడుగుతుంటారు. రోజూ ఇలా అడిగితే వారి జీవితాలు ఏం బాగుపడతాయని చెప్పి ఇవ్వకుండా ఆగిపోయే వారు చాలా మంది ఉంటారు. అయితే డబ్బు ఇవ్వడం కంటే వారికి ఆకలి వేస్తే కడుపు నింపడం ఉత్తమం అని చాలా మంది హోటల్ కు తీసుకెళ్లి భోజనం పెట్టడం లాంటివి చేస్తున్నారు. ఎంత డబ్బు దానం చేసినా గానీ వారి జీవితాలు మారవు. మరి వారి జీవితాలు మారాలంటే ఏం చేయాలి? వారికంటూ ఒక గౌరవం తీసుకురావాలంటే ఏం చేయాలి? అన్న ఆలోచన నుంచి వచ్చిందే బెగ్గర్స్ కార్పొరేషన్. బెగ్గర్స్ కార్పొరేషన్ ఆ? అదెక్కడుంది? అని అనుకుంటున్నారా?
ఒడిశాకు చెందిన చంద్ర మిశ్రా అనే వ్యక్తి బెగ్గర్స్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్పొరేషన్ కోసం ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటారు. అది కూడా వడ్డీకే తీసుకుంటారు. బయట రోడ్ల మీద కనిపించే యాచకులకు దానం చేయకండి.. కావాలంటే మా బెగ్గర్స్ కార్పొరేషన్ లో పెట్టుబడులు పెట్టండి అని చెబుతున్నారు. దానం వద్దు, పెట్టుబడులే ముద్దు అనే నినాదంతో ఈ కార్పొరేషన్ ను ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం వచ్చిన డబ్బుతో యాచకుల జీవితాలను మార్చడం. ఈ కార్పొరేషన్ లో ఎవరైనా పెట్టుబడులు పెడితే ఆ డబ్బుతో యాచకులతో కూరగాయల దుకాణం, పూల దుకాణం, బ్యాగులు కుట్టించడం వంటి వ్యాపారాలు పెట్టించి వారికొక దారి చూపిస్తారు.
ఇందులో పెట్టుబడి పెట్టిన ప్రజలకు తిరిగి ఆ డబ్బు చెల్లించడమే కాకుండా ఏడాదికి 16.5 శాతం వడ్డీ కూడా ఇస్తారు. అంటే ఒక రూపాయి 30 పైసల కంటే ఎక్కువే. రూ. 10 నుంచి రూ. 10 వేల వరకూ మీకు తోచినంత పెట్టుబడి పెట్టండి. 6 నెలల్లో 16.5 శాతం వడ్డీతో తిరిగి చెల్లిస్తామని చంద్ర మిశ్రా అంటున్నారు. ఇలా ఆయన ఇప్పటి వరకూ 14 మంది యాచకుల జీవితాలను మార్చారు. ఒక్కో బెగ్గర్ కు లక్షన్నర పెట్టుబడి అవుతుందని.. అందులో రూ. 50 వేలతో నైపుణ్యాలపై శిక్షణకు వెచ్చిస్తున్నామని.. మిగిలిన లక్షతో వారికి వ్యాపారం పెట్టిస్తున్నామని అన్నారు. మీరు పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ఆదాయమే కాకుండా.. మీ డబ్బుతో కొంతమంది యాచకుల జీవితాలు బాగుపడతాయని అంటున్నారు.
ఇది ఒడిశా రాష్ట్రంలో జరుగుతుంది. దీనికి ప్రభుత్వం కూడా సహకారం అందించి ముందుకు వస్తే ప్రతీ రాష్ట్రంలో బెగ్గర్స్ అనే వారే ఉండరు. వారు కూడా మనుషులతో పాటు గౌరవంగా జీవిస్తారు. నిజానికి ఈ ఆలోచన చాలా మంచిది. ఈయనను ఆదర్శంగా తీసుకుని నేటి యువత ఇలాంటి స్టార్టప్ లు పెట్టి ఎంతోమంది జీవితాలను మార్చవచ్చు. ఊరికే దానం చేయమంటే ఆలోచిస్తారు గానీ వడ్డీ వస్తుందంటే ఇవ్వకుండా ఉంటారా? ఇన్వెస్ట్ చేయకుండా ఉంటారా? యాచకులకు గౌరవం, జీవితం ఇస్తున్న చంద్ర మిశ్రాకి ఒక సెల్యూట్ చేయండి.