గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశంపై రగడ కొనసాగుతుంది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని పై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపి రాజధాని నిర్ణయ అధికారం రాష్ట్రానికే ఉంటుందని కేంద్రం ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ అంశంపై రాజ్యసభలో స్పందించిన కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ ఏపి రాజధానిపై నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని అన్నారు. ప్రస్తుతం తమ దగ్గర ఉన్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని కుండబద్దలు కొట్టారు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్.
రాజ్యసభ సభ్యులు, బిజెపి నాయకులు జీవీఎల్ నరసింహారావు అమరావతి రాజధాని పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు. తమ దృష్టిలో ఇప్పటికి కూడా అమరావతి రాజధాని అని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించినట్లు ప్రకటించారు.
మూడు రాజధానుల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. రాజధానికి భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేపట్టారు. అమరావతి రాజధానిగా ఉండాలని ప్రజలు, విపక్షాలు పెద్ద ఎత్తున నిరసలు తెలిపారు. రెండున్నరేళ్లుగా మూడు రాజధానులపై భీష్మించుకొని కూర్చున్న సీఎం వైఎస్ జగన్ ఎట్టకేలకు బిల్లును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.