పెళ్లిళ్లలో మ్యూజిక్ తో వచ్చే కిక్కే వేరు. సరదాగా ఫ్రెండ్స్ తో డ్యాన్స్ లు చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వివాహాది కార్యక్రమాల్లో సినిమా సాంగ్స్ వినియోగంపై కాపీరైట్ సంస్థలు రాయాల్టీ వసూల్ చేస్తున్నట్లు కంప్లైంట్స్ వచ్చినట్లు కేంద్రం తెలిపింది.
సంగీతం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మైండ్ రిలాక్సేషన్ కోసం కొందరు సినిమా పాటలను వింటూ ఎంజాయ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఈ రోజుల్లో పెళ్లిళ్లు, బర్త్ డే ఫంక్షన్లు ఇతర శుభకార్యాలల్లో డిజెల్లో సినిమా పాటలు పెట్టుకుని ఆనందంగా గడపడం మనందరం సాధారణంగా చేసే పనే. అయితే సినిమా పాటల వాడకంపై కొత్త వాదన తెరపైకి వచ్చింది. తాజాగా వివాహాది శుభకార్యాల్లో సినిమా పాటలు వాడటం కాపీరైట్ కిందికి వస్తుందని పలు సంస్థలు రాయల్టీని వసూల్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని కేంద్రం వెల్లడించింది. దీనిపై స్పందిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కీలక ప్రకటన చేసింది. ఆ విరాలేంటో ఇప్పుడు చూద్దాం.
సంగీత, సాహిత్య, కళాత్మక రంగాలకు చెందిన కాపీరైట్ సంస్థలు రాయల్టీని వసూల్ చేసే హక్కును కలిగి ఉంటాయి. ఈ క్రమంలో పెళ్లిళ్లు, శుభకార్యాల్లో మూవీ సాంగ్స్ వాడకంపై కాపీరైట్ సంస్థలు రాయల్టీని వసూల్ చేస్తున్నట్లు కొందరు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.. వివాహ వేడుకల్లో, సంగీత్ ఫంక్షన్ లలో, మతపరమైన వేడుకల్లో సినిమా పాటలు వినియోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందికి రాదని సెంట్రల్ గవర్నమెంట్ వెల్లడించింది. కాపీరైట్ సంస్థలు రాయల్టీని వసూల్ చేయకూడదని స్పష్టం చేసింది.
ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్, ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐటీ) ప్రకటన విడుదల చేసింది. అటువంటి కార్యక్రమాల్లో రాయాల్టీ వసూల్ చేయడం కాపీరైట్ యాక్ట్ 1957లోని సెక్షన్ 52(1)కు విరుద్ధమని వెల్లడించింది. మతపరమైన కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ప్రదర్శించే నాటక, ఏదైనా సౌండ్ రికార్డింగ్‌లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు రావని సెక్షన్ 52 (1) (za) చెబుతోందని అధికారులు స్పష్టం చేశారు. కాపీరైట్ సంస్థలు రాయల్టీని వసూల్ చేయాలని చూస్తే దానికి అంగీకరించవద్దని డీపీఐటీ తెలిపింది.