మద్యపానం, ధూమపానం వంటికి మన ఆరోగ్యానికి ఎంత కీడు చేస్తాయో.. వాటిని వాడే ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే చాలా మంది ఆ అలవాటు మార్చుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి అలవాట్ల వల్ల మన ఇళ్లు, ఒళ్లు గుల్ల అవుతుందని తెలిసినా సరే ఆ అలవాట్లను మానుకోలేరు. ఇక పొగాకు, మద్యపానం వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసిన లాభం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పొగ తాగేవారిని తగ్గించడం కోసం దేశంలో సింగిల్ సిగరెట్ అమ్మకంపై నిషేధం విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు.. ఇప్పటికే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేసింది.
తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులు, యువత.. వ్యక్తిగత సిగరెట్ స్టిక్స్, అన్‌టైడ్ పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇలా విడివిడిగా.. ఒక్కొక్క సిగరెట్, పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడం వారికి అనుకూలంగా ఉంది. ఈ క్రమంలోనే అటువంటి విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోనే ఇది అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
మనదేశంలో పొగతాగేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. అయితే ధూమపానం చేసేవారిలో చాలా మంది విడి విడిగా ఒకటి, రెండు సిగరెట్లు కొనుగోలు చేస్తారు. ఇవి తక్కువ ధరకే లభిస్తుండటంతో చాలా మంది ధూమపానంవైపు ఆకర్షితులవుతున్నారు. ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సింగిల్ సిగరెట్ అమ్మకాలపై నిషేధం విధించే ఆలోచనలో ఉంది. అలానే విమానాశ్రయాల్లో కూడా స్మోకింగ్ జోన్లను మూసివేయాలని కమిటీ సిఫార్సు చేసింది.
తర్వలో జరగబోయే.. సాధారణ బడ్జెట్ సమావేశాల్లో పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్ను పెంపు ఉంటుందన్న ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. వాటి ప్రకారం.. అన్ని పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పెంచనున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఎక్సైజ్ సుంకం పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే ఆదాయాన్ని పెంచే చాలా ప్రభావవంతమైన విధానం. ఇది ఆదాయాన్ని సంపాదించడానికి, పొగాకు వినియోగం, సంబంధిత వ్యాధులను తగ్గించడానికి విజయవంతమైన ప్రతిపాదననగా చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం లభించడమే కాక.. లక్షలాది మంది సామాన్యులు, యువత పొగాకు దూరమవుతారని భావిస్తున్నారు. మరి సింగిల్ సిగరెట్ అమ్మకంపై నిషేధం విధించడం వల్ల ప్రయోజనం ఉంటుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.