ప్రభుత్వం నుంచి అందే సాయం అంటే చాలు.. అర్హులు కన్నా ఎక్కువగా అనర్హులే పోటీ పడతారు. రేషన్ కార్డుల విషయంలో ఈ తరహా వారు ఎక్కువగా కనిపిస్తారు. అయితే వీరిపై త్వరలోనే కేంద్ర కన్నెర్ర చేయనుంది. ఆ వివరాలు..
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. నకిలీ పద్ధతిలో కార్డు తీసుకుని.. రేషన్ పొందుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర సర్కారు రెడీ అవుతోంది. వారిపై కఠిన చర్యలు తప్పవని వెల్లడించింది. తప్పుడు ఆధారాలు సమర్పించి రేషన్ కార్డు తీసుకుని.. రేషన్ పొందుతున్న వారు స్వయంగా తమ కార్డులను రద్దు చేసుకోవాలని కేంద్రం సూచించింది. నకిలీ పద్దతిలో కార్డు పొందిన వారు.. స్వయంగా రద్దు చేసుకోకుండా అలానే ఉంటే.. ఆహార శాఖ బృందం పరిశీలన అనంతరం.. వారి కార్డు రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు కూడా తప్పవని హెచ్చరిస్తోంది. దేశంలో సుమారు 10 లక్షల మంది అక్రమంగా రేషన్ పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది గుర్తించింది. ఈ క్రమంలో తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు రేషన్ కార్డు ఉంది. వీరంతా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఫ్రీ రేషన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రేషన్ కార్డు హోల్డర్స్‌కి.. బియ్యం, గోధమలు, కందిపప్పు అందజేస్తారు. ఇక కరోనా సమయంలో చాలా ప్రభుత్వాలు రేషన్ కార్డ్ హోల్డర్స్‌కి నగదు సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇక తప్పుడు పత్రాలు సమర్పించి.. దొంగ దారిలో రేషన్ కార్డు పొందినవారికి.. రేషన్ సరఫరా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం గతేడాదే నిర్ణయం తీసుకుంది. ఇక త్వరలోనే అనర్హులందరీ పూర్తి జాబితాను రేషన్ డీలర్లకు పంపుతామని చెప్పింది. ఆ లిస్టు వారి వద్దకు చేరగానే.. నకిలీ కార్డులు కలిగిన వారికి రేషన్ ఆగిపోతుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రతి ఏటా ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించే వారు లేదా 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారు రేషన్ పొందేందుకు అనర్హులని కేంద్రం చెబుతోంది. అంతేకాక రేషన్ కార్డు హోల్డర్లకు 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్లాట్, ఇల్లు, ఫోర్ వీలర్, ఆయుధాల లైసెన్స్, కుటుంబ ఆదాయం.. గ్రామంలో రెండు లక్షలు, నగరంలో మూడు లక్షల కంటే ఎక్కువ ఉండి.. రేషన్ కార్డు ఉన్న వారు.. స్వచ్ఛందంగా తమ రేషన్ కార్డు వదులుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అనర్హులు తమ రేషన్ కార్డులను తహసీల్దార్ కార్యాలయంలో సరెండర్ చేయాలని సూచిస్తోంది.
ఉచిత రేషన్‌తో వ్యాపారం చేసేవారిపై కూడా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. అంతేకాక వరుసగా నాలుగు నెలలపాటు రేషన్ తీసుకోని వారి కార్డులు కూడా రద్దు అవుతాయని హెచ్చరిస్తోంది. రేషన్‌కార్డు హోల్డర్ కార్డును సరెండర్ చేయకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విచారణలో తప్పుడు పత్రాలో రేషన్ కార్డు పొందిన వారు దొరికితే.. వారి కార్డు రద్దు చేయడమే కాక.. వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. ఇన్నాళ్లు వారు పొందిన రేషన్‌ను తిరిగి వసూలు చేసే అవకాశం కూడా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.