ఇటీవల సెకండ్ వేవ్ కు ముందు నాటి పరిస్థితులే దేశంలో ఇప్పుడు మరోసారి కనిపిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్న సమయంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. కోవిడ్ నిబంధనలను కొనసాగించాలని, నిర్లక్ష్యం వహించవద్దని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టి పెట్టాలని ఆదేశించింది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. ఈ క్రమంలో, 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు పెరిగిపోతుందని.. గత రెండు వారాలుగా ఆయా ప్రాంతాల్లో కొత్త కేసుల సంఖ్య అధికంగా నమోదవుతోందని తెలిపింది. కరోనా మార్గదర్శకాల అమలుపై నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేసింది. కేరళ, మిజోరం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, మణిపూర్, నాగాలాండ్ లోని 19 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్య పాజిటివిటీ రేటు ఉందని వెల్లడించింది.
మూడు రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో 10 శాతం కంటే అధికంగా పాజిటివిటీ రేటు నమోదవుతోందని వివరించింది. ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు కనిపిస్తే.. వెంటనే అక్కడి స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టాలని, ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచాలని రాకేష్ భూషణ్ కోరారు. కంటైన్మెంట్ జోన్లగా పరిగణించాలని, రాత్రి కర్ఫ్యూ విధించాలని తెలిపారు. జన సమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గనే వారిపై పరిమితులు విధించాలని పేర్కొన్నారు. ఇక ఒమిక్రాన్ కేసులు దేశంలో పెరుగుతుండటంతో కొత్త వేరియంట్ మరో విపత్తు కాగలదన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇలాగే డెల్టా వేరియంట్ దేశంలో అత్యధిక ప్రాణనష్టానికి దారితీసింది.