ప్రభుత్వ ఉద్యోగులు, ఎంఎన్‌సీ కంపెనీల్లో పనిచేసే వారు వృత్తి రీత్యా కొన్నిసార్లు వేరే రాష్ట్రాలకు బదిలీ అవుతారు. అలాంటి సందర్భాల్లో వారి వ్యక్తిగత వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేయించాల్సి వస్తుంది. ఇకపై అలా చేయాల్సిన పనిలేదంటూ కేంద్రం ‘భారత్ రిజిస్ట్రేషన్’ సిరీస్‌ను తీసుకొచ్చింది. దీనివల్ల తిరిగి మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించే బాధ తప్పుతుంది. తాజాగా భారత్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ వెలువరించింది.
అయితే, ఆ రిజిస్ట్రేషన్ విధానం అందరి కోసం కాదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీలు/ సంస్థల ఉద్యోగులయితే వారి వారి కంపెనీ కనీసం నాలుగు రాష్ట్రాల్లో సేవలందిస్తుండాలి. ఈ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని స్వచ్ఛందంగా ఉపయోగించుకోవచ్చని కేంద్రం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా సులువుగా వెళ్లేందుకు వీలుపడుతుందని పేర్కొంది.
ప్రస్తుత విధానం ప్రకారం ఒక రాష్ట్రం నుంచి బదిలీపై వేరే రాష్ట్రం వెళ్లినప్పుడు వారి వ్యక్తిగత వాహనాలతో ఆ రాష్ట్రంలో 12 నెలలు మాత్రమే తిరిగేందుకు వీలుంటుంది. అంతకు మించి అక్కడ కొనసాగాలంటే వారి వాహనానికి తిరిగి రిజిస్ట్రేషన్ చేయించాలి. అది కూడా గడువులోపే రీ రిజిస్ట్రేషన్ చేయించాలి. ‘భారత్ రిజిస్ట్రేషన్’తో అయితే ఆ బెడద తప్పుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.