న్యూఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పేరుతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి పూర్తి ఏర్పాటు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మే 28న భారత ప్రధాని మోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తున్నారు.
ఇప్పటి వరకు మార్కెట్లో చెల్లుబాటులోకి ఎన్నో కాయిన్స్ వచ్చాయి. ఇప్పుడు భారత్ మార్కెట్ లోకి త్వరలో 75 రూపాయల కాయిన్ రానుంది. ఈ నెల 28వ తేదీన నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా 75 రూపాయల నాణాన్ని విడుదల చేయబోతుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే..
మనదేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న నాణేలు రూ.1, రూ.2, రూ.5 మాత్రమే. ఇండియాలో నాణేలు ముద్రించే నగరాలు నాలుగు ఉన్నాయి. అవి ముంబై, కోల్ కతా, హైదరాబాద్, నోయిడా ఈ నాలుగు ముఖ్య నగరాల్లో మాత్రమే నాణేలు ముద్రించబడతాయి. ద్రవ్యాన్ని ముద్రించే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం కలిగి ఉంటుంది. అయితే న్యూఢిల్లీలో కొత్తగా పార్లమెంట్ భవనం నిర్మించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. మే 28న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తున్నారు. అదే రోజు రూ.75 నాణేన్ని ముద్రించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
రూ.75 నాణెంపై పార్లమెంట్ భవనం ముద్రించి ఉంటుంది. వృత్తాకారంలో ఉన్న దీని వ్యాసం 44 మి.మీ. ఉంటుంది. దీని బరువు 35 గ్రాములుంటుంది. ఈ కాయిన్ 50% వెండి, 40% రాగి, 5% జింక్ మరియు 5% నికెల్ లోహాలతో ముద్రిస్తారు. నాణెంపై ఒకవైపు అశోక స్తంభం, నాలుగు సింహాల చిహ్నం దాని కింద ‘సత్యమేవ జయతే’ అక్షరాలు రాసి ఉంటాయి. నాణేనికి ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్ అన్న పదం, కుడివైపు భారత్ అనే ఇంగ్లీష్ పదంలో ఉంటుందని ఆర్థిక శాఖ పేర్కొంది.