“పొగతాగడం.. ఆరోగ్యానికి హానికరం పైగా ప్రాణాంతకం” అని ప్రభుత్వాలు ఎన్ని ప్రచారాలు చేసినా ధూమపానం సేవించే వారిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఈ పొగ తాగటానికి బానిసలుగా మారారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రాణాల మీదకు వచ్చినా ఆ అలవాటును మాత్రం మానలేకపోతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు, కన్నవాళ్ళు, అయిన వాళ్ళు ఇలా ఎవరు చెప్పినా పొగ తాగడాన్ని మాత్రం మాన్పించలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం పన్నులు, జీఎస్టి, ఎక్సైజ్ సుంకం అంటూ ధరలు పెంచేస్తూనే ఉంది. ఇక వారి తీరుతో విసుగిపోయిన కేంద్రం పొగరాయుళ్లకు గట్టి జలక్కిచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ పన్నులు, జీఎస్టీలతో వారు అలవాటును మాన్పించలేకపోతున్నాయని నిర్ధారణకు వచ్చారు.
ఇక పన్నులు పెంచడంతో పని కాదని నిర్ణయం తీసుకున్న కేంద్రం.. అమ్మకాలు పైన దృష్టి సారించింది. ఏకంగా అమ్మ కాలనే నిషేధించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం సిగరెట్ల అమ్మకంపై నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది. మరికొద్ది రోజుల్లో పూర్తి నిషేధం విధించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టడాని ముందే సిగరెట్ల అమ్మకంపై ఓ నిర్ణయానికి వస్తారంటూ నివేదికలు పేర్కొంటున్నాయి. అటు విమానాశ్రయాల్లో కూడా స్మోకింగ్ జోన్లపై నిషేధం విధించాలని యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధూమపానం, సిగరెట్లు తాగటం వల్ల ఏటా 3.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారంటూ నివేదికల్లో షాకింగ్ విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
అయినా ఈ పొగరాయుళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదు. 2023 ఫిబ్రవరి 1న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 23- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందే పొగరాయుళ్ళను అరికట్టేందుకు తగిన చర్యలు, కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి స్టాండింగ్ కమిటీ కొన్ని సిఫార్సులు చేసిందట. ఆ సిఫార్సుల్లో ప్రధానంగా సిగరెట్లు విక్రయాలను విడిగా అమ్మడాన్ని నిషేధించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో సిగిరెట్ ను విక్రయించటాన్ని నిషేధించాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసిందట.
మరోవైపు విమానాశ్రయాల్లో కూడా స్మోకింగ్ జోన్ల పై నిషేధం విధించాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులపై గరిష్టంగా 28% జీఎస్టీని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే 290% వరకు ఎక్సైజ్ పన్నులు కూడా కేంద్రం వసూలు చేస్తోంది. ఈ చర్యలు ఏవీ ప్రభావం చూపట్లేదు. వీటి వల్ల ప్రతికూల ఫలితాలే వస్తున్నాయంటూ స్టాండింగ్ కమిటీ అభిప్రాయ పడింది. ఇప్పటివరకు మొత్తంగా సిగరెట్లపై 64% పన్నులు అమలులో ఉన్నాయి. కానీ వాటి విక్రయాల్లో మాత్రం ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదు. అలాగే ఆరోగ్య సంస్థ కూడా సిగరెట్లపై పన్నును 75% పెంచాలని కోరింది.