అవినీతికి పాల్పడే వ్యక్తుల బండారాన్ని బయటపెట్టేందుకు దేశంలో స్వతంత్య్ర దర్యాప్తు సంస్థలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండియా(ఈడీ) పనిచేస్తున్నాయి. అయితే ఇవి కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు కోర్టు మెట్టెక్కాయి. అయితే.. చివరకు..
దేశంలో వేళ్లూనుకుపోయిన అవినీతి బండారాన్ని బయటపెట్టేందుకు పనిచేస్తుంటాయి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండియా(ఈడీ). ఇటీవల ఎక్కువగా ప్రతిపక్ష నేతల నివాసాల్లో, కార్యాలయాల్లో ఈ దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేపట్టాయి. దీంతో ఈ సంస్థలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని అధికారంలోని బీజెపీ ప్రభుత్వం ఆడిస్తుందని విమర్శలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలు ఇటీవల ఖండించిన ప్రధాని మోడీ.. వీటి పనితీరును మెచ్చుకున్నారు. విపక్ష నేతలు సీబీఐపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అవి స్వేచ్ఛాయుతంగా పనిచేయాలని సూచించారు. ఢిల్లీలో జరిగిన సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేయగా.. 2014 తరువాత సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోందన్నారు.
అయితే దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే పిటిషన్‌ను విచారించేందుకు దేశ అత్యున్నత న్యాయ స్థానం నిరాకరించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేసిందని, రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ 14 విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపపుచ్చింది . ప్రతిపక్ష పార్టీల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌లో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లు.. ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్నారు.
రాజకీయ శత్రుత్వానికి ఈ దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని అన్నారు. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్ష నేతలపై ఏదో ఒక కేసు పెట్టి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఏడేళ్లలో ఈడీ 6 రెట్లు ఎక్కువ కేసులు నమోదు చేసిందని పేర్కొన్న సంఘ్వీ , అందులో 23 శాతం మాత్రమే నేరారోపణలున్నాయన్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో 95 శాతం దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయని, పక్షపాతంతో పాటు ఇది రాజకీయ పగ అని స్పష్టంగా తేలిందని ఆరోపించారు. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ చెల్లుబాటు, సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. చివరికీ దీనిపై విచారించేందుకు నిరాకరించింది.