రాష్ట్రాలకు, దేశానికి లక్షల కోట్లకు మించిన అప్పులున్నాయని మీకు తెలుసా? ఆ రుణభారమంతా ఏదో ఒకరోజు పెనుభారంగా మారనుంది. అయినా సరే ఏ సర్కారు వెనక్కి తగ్గడం లేదు. అప్పు చేసైనా సరి పప్పు కూడా తినాలంటూ తెగ అప్పులు చేసేస్తున్నారు. ఇలా కొండలా పేరుకుపోతున్న అప్పులతో మన ఆధునిక భారతం అప్పుల కుప్పలా మారిపోయింది. తాజాగా, దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పుల జాబితాపై కేంద్రం ఓ స్పష్టతనిచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. లోక్ సభలో సోమవారం రాష్ట్రాల అప్పులపై టీఆర్ఎస్ ఎంపీలు లిఖిత పూర్వక ప్రశ్న సంధించారు. దీనిపై స్పందించిన కేంద్రం రాష్ట్రాల అప్పుల వివరాలను వెల్లడించింది.
కేంద్ర ఆర్థిక శాఖ(సహాయ) మంత్రి పంకజ్ చౌదరి.. రాష్ట్రాల అప్పుల వివరాలను వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. దేశంలో అప్పుల్లో తమిళనాడు రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 2022 నాటికి తమిళనాడు అప్పు రూ. 6,59,868 కోట్లుగా తెలిపారు. అలాగే.. రూ. 6,53,307 కోట్ల అప్పుతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా, రూ. 6,08,999 కోట్ల అప్పుతో మహారాష్ట్ర మూడో స్థానంలో, రూ. 5,62, 697 కోట్ల అప్పుతో పశ్చిమబెంగాల్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇక రూ. 4,77,177 కోట్ల అప్పుతో రాజస్థాన్ ఐదో స్థానంలో ఉండగా, రూ. 4,61,832 కోట్ల అప్పుతో కర్ణాటక ఆరో స్థానంలో, రూ. 4,02,785 కోట్ల అప్పుతో గుజరాత్ ఏడు స్థానంలో నిలిచింది.
ఇక అప్పుల్లో తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలవగా, తెలంగాణ 11వ స్థానంలో నిలించింది. 2022 నాటికి ఏపీ అప్పు రూ. 3,98,903 కోట్ల రూపాయలు, తెలంగాణ అప్పు రూ. 3,12,191 కోట్ల రూపాయలుగాకేంద్రం తెలిపింది. కాగా, అప్పుల పెరుగుదలలో ఏపీ 10.7 శాతంతో దేశంలో 15వ స్థానంలో నిలవగా.. 16.7 శాతంతో తెలంగాణ దేశంలో ఆరో స్థానంలో నిలిచింది. అభివృద్ధిలో మేమంటే.. మేం ముందు అని చెప్పుకునే రాష్ట్రాలు.. ఈ అప్పుల గణాంకాలపై కూడా నోరు విప్పితే బాగుంటుందని ఓటర్లు కోరుతున్నారు. ఈ అప్పులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.