గత కొంత కాలంగా గ్యాస్ ధరల విషయంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. వరుసగా సిలిండర్ ధరలు పెంచుతూ సామాన్యుడిపై పెను భారం మోపింది. విపక్షాలు గగ్గోలు పెట్టినప్పటికీ కేంద్రం గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోయింది. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్ర మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగాలకు ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న సబ్సిడీ ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.
ఈ సబ్సిడీ ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం’ కింద ఫ్రీగా గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారికి మాత్రం పరిమితం చేసింది. ఈ స్కీం కింద సిలిండర్లు తీసుకున్నవారికి ప్రతి సంవత్సరం పన్నెండు ఇస్తారు. ఇందులో ఒక్కో సిలిండర్ కి రెండువందల రూపాయల సబ్సిడీ ఉంటుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి సాధారణ ప్రజానికం సిలిండర్ ని మార్కెట్ ధరల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యుల నెత్తిన మరో బండరాయి పడ్డట్టే అంటున్నారు. ఇప్పటికే చమురు ధరలు, వంట నూనె ధరలు అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు వంట గ్యాస్ కూడా పెరిగిపోవడం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే అంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో వాడుకునే గ్యాస్ సిలిండర్ వెయ్యి రూపాయలు దాటింది.. ఇప్పుడు ఇందులో సబ్సిడీ తీసివేయడం మరో భారం కానుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.