అనుకున్నదీ సాధించలేనిదీ ఏదీ లేదు అనే వ్యాఖ్యలు అమెకు సరిగ్గా సరిపోతాయి. చిన్న పిల్లలకు ట్యూషన్లు చెబుతూ.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి.. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. చిన్పప్పుడే వ్యాపార రంగంలోకి రావాలన్న కలలు కన్న ఆమె.. ఆ కలలను సాకారం చేసుకుంది.
‘పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండా నీదే విజయం.. కష్టపడితే రాదా ఫలితం’ అని ఓ సినీ కవి రాసిన వాక్కులు అక్షర సత్యాలు. లక్ష్యాలేని జీవితం వ్యర్థం. అనుకున్నదీ సాధించడంలో ఉన్న ఆత్మ సంతృప్తి ఖరీదైన వస్తువులు పొందినప్పుడు కూడా రాదు. గమ్యం చేరేంత వరకు విశ్రమించకుండా పోరాడితే.. అసాధ్యమన్నదే లేదు. అందుకు ఉదాహరణలుగా అనేక మంది మహానుభావులు నిలిచారు. ఇంకా నిలుస్తూనే ఉన్నారు. సమస్యలు వచ్చినా అక్కడితో ఆగిపోకుండా..ముందుకు దూసుకు వెళుతూ లక్ష్యాలను నెరవేర్చుకున్న నాడే విజయం సిద్ధిస్తుంది. విజయం కోసం పోరాడే సమయంలో ఓటములు ఎదురౌతు ఉంటాయి. అయితే ’ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే.. మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే‘ అన్నవ్యాఖ్యలు గుర్తుంచుకుని పోరాడుతూ ఉండాలి.
పిల్లలకు ట్యూషన్ చెప్పే స్థాయి నుండి ఎంతో మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగింది ఓ నారీమణి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుండి కూడా ప్రశంసలు పొందింది. ఆమెనే త్రినా దాస్. ఇంతకు ఆమె ఎవరో.. ఆమెకు ఇంతటి సక్సెస్ ఎలా సాధ్యమైందో చూద్దాం. పశ్చిమ బెంగాల్‌లో పుట్టిన త్రినా దాస్.. కోల్‌కతాలోని బల్లిగంజ్ శిక్షా సదన్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ చదివింది. తొలి నుండి తాను పెద్ద వ్యాపార వేత్తను కావాలని కలలు కనింది. దేశానికి తన వంతు కృషినందించాలని భావించింది. చదువుకుంటూనే ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పేది. చాలా తక్కువ ఫీజుతోనే 11,12 తరగతుల విద్యార్థులకు భౌతిక, రసాయ శాస్రంతో పాటు లెక్కలు బోధించేంది. 16 మందితో మొదలైన తన ట్యూషన్ .. చివరి నాటికి 1800 మందికి చేరింది. అయితే విద్యార్థులు పెరగడంతో తనకు సాయంగా మరికొంత మంది ఉపాధ్యాయులను నియమించుకుంది. దీంతో ఆమెకు వచ్చే ఆదాయం పెరిగింది. ఏడాదికి రూ. 8 నుంచి 10 లక్షలు సంపాదించింది.
అతి తక్కువ కాలంలోనే ఆమె ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా 86 కోచింగ్ సెంటర్లను ప్రారంభించింది. 2014-15 నాటికి రూ. 5 కోట్లకు ఆర్జించింది. అనంతరం ఆమె ఈ పెట్టుబడితో మరో వ్యాపారం వైపుగా దూసుకు వెళ్లింది. త్రినా దాస్ 2017లో తన ఇద్దరు స్నేహితులైన నీరజ్ దహియా, అరుణ్ సెహ్రావత్‌తో కలిసి టాలెంట్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించింది. దీని ద్వారా ఒక సంవత్సరంలో సుమారు రూ. 20 కోట్లు సంపాదించారు. మొదటి లాక్‌డౌన్ సమయంలో వారు బ్లూ కాలర్ ఉద్యోగాలపై దృష్టి సారించి ఉద్యోగాలు కోల్పోయిన వారికి గుర్గావ్, ఢిల్లీలోని అనేక కంపెనీలకు సెక్యూరిటీ వర్కర్లు, డెలివరీ బాయ్స్, ఆఫీస్ వర్కర్స్ ఉద్యోగాలను అందించడం ప్రారంభించారు. దీని ద్వారా దాదాపు 6,000 మందికి ఉద్యోగాలను కల్పించారు. ఏప్రిల్ 2022లో కంపెనీలకు ఉద్యోగులను అందించడానికి నిర్ణయించుకున్నారు. దీని ద్వారా ఉద్యోగులు మంచి జీతం, హోదా పొందవచ్చని ఆశించింది. దీనికోసం వారు గిగ్‌చెయిన్ ప్రారంభించి వివిధ కంపెనీలకు ఉద్యోగులను అందించింది. ప్రస్తుతం వారి టర్నోవర్ రూ. 102 కోట్లు. 2021లో తోటి వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.