దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ‘బుల్లి బాయ్’ యాప్ కేసులో ప్రధాన నిందితురాలు పోలీసులకు చిక్కింది. ముస్లిం మహిళలను వేలానికి పెట్టినట్టు ఆరోపణలున్న బుల్లీభాయ్ యాప్ వెనుక సూత్రధారి 18 ఏళ్ల బాలిక శ్వేతాసింగ్ ని ముంబై సైబర్ సెల్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మంగళవారం ఉత్తరాఖండ్ లోని ఉదంసింగ్ నగర్ జిల్లా రుద్రపూర్ లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి విశాల్ కుమార్ ఝా (21)ను సోమవారమే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
విశాల్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన నిందితురాలైన శ్వేతా సింగ్‌ను ఉత్తరాఖండ్‌లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అనంతరం విచారణ కోసం ముంబై తీసుకురానున్నారు. ఇందుకోసం ఉత్తరాఖండ్ కోర్టులో ఆమెను ప్రవేశపెట్టి ట్రాన్సిట్ రిమాండ్ కోరనున్నారు. విశాల్, శ్వేతాసింగ్ వీరిద్దరూ ఒకరికొకరు తెలుసని పోలీసులు తెలిపారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీరిద్దరికీ పరిచయం అయినట్టు పేర్కొన్నారు. బుల్లి బాయ్ యాప్‌కు సంబంధించి నిందితురాలు మూడు ఖాతాలు నిర్వహిస్తున్నట్టు తేలింది. సహ నిందితుడైన విశాల్ కుమార్.. ఖల్సా సూపర్‌మిస్ట్ పేరుతో ఖాతా తెరిచినట్టు పోలీసులు వివరించారు.
ఇది చదవండి : స్కూల్ కు వెళ్తుంటే లిఫ్ట్ ఇస్తామన్నారు.. ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి
తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన శ్వేతాసింగ్ కు ఇద్దరు సోదరీమణులు, 8వ తరగతి చదివే ఒక సోదరుడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. శ్వేతా సింగ్ ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షల కోసం సన్నద్దమవుతోంది. అయితే ద్వేషపూరిత వ్యాఖ్యలను ఆమె అదే పనిగా పోస్ట్ చేయడమే కాకుండా.. జట్ ఖల్సా07 పేరిట ట్విట్టర్ హ్యాండిల్ పేరిట సెలబ్రిటీల అభ్యంతరకర ఫొటోలను పోస్ట్ చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇక ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే 100 మందికిపైగా ముస్లిం మహిళల ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి బుల్లి బాయ్ అనే యాప్‌లో అప్‌లోడ్ చేసి వేలానికి ఉంచిన విషయం తెలిసిందే.