దేశంలో రెండేళ్లుగా కరోనా మహమ్మారి పెడుతున్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కరోనా సమయంలో నగరాల్లో ఉన్న జనాభా చాలా వరకు సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. అక్కడే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. కొంతమంది వ్యవసాయం, పశుపోషణపై దృష్టిసారించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సాధారణంగా ఒక ఎద్దు విలువ మహా అంటే 50వేలు ఉంటుంది.. మంచి ఒంగోలు గిత్తలు అయితే లక్ష నుంచి రెండు మూడు లక్షల వరకు ఉంటాయి.
బెంగళూరులో ఏర్పాటు చేసిన వ్యవసాయ మేళాలో హళ్లికార్ రకం ఎద్దు విలువ ఏకంగా కోటి రూపాయలు పలికింది. కర్ణాటకలోని మండ్య జిల్లా మళవళ్లి నుంచి వచ్చిన ఈ మూడున్నరేళ్ల వయసున్న ఎద్దును చూసేందుకు అందరూ ఆసక్తి కనబరిచారు. హళ్లికార్ జాతి గిత్తల పెంపకం కర్ణాటక రాష్ట్రంలో పెరిగింది. ఈ జాతి గిత్తలకు ఇటీవల కాలంలో గిరాకి ఏర్పడింది. సాధారణంగా మేలుజాతి గిత్తలు 7 నుంచి 12 లక్షల వరకు పలుకుతుంటాయి. అయితే హళ్లికార్ జాతిలో మేలురకం గిత్తలు ఒక్కొక్కటి కోటి రూపాయల వరకు ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
ఈ జాతి ఆవు పాలల్లో ఆరోగ్యాన్ని రక్షించే ఏ2 ప్రోటీన్ అధికంగా ఉంటుందని, ఈ ఆవుపాలను మెడిసిన్ రంగంలో ఎక్కువగా వినియోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. మండ్య జిల్లా మళవళ్లికి చెందిన రైతు బోరేగౌడ వ్యవసాయ ప్రదర్శనకు తను పోషిస్తున్న హళ్లికార్ జాతి ఎద్దును ప్రదర్శనకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎద్దు కోటి రూపాయల విలువ చేస్తుందని.. దీని వీర్యాన్ని వారానికి ఒక రోజు సేకరిస్తారని.. డోస్‌ను రూ.వెయ్యితో విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీర్యాన్ని విక్రయించేందుకు రామనగర, దావణగెరె, చిక్కమగళూరుల్లో ప్రత్యేక కేంద్రాలు ప్రారంభించామని దీని యజమాని బోరేగౌడ వెల్లడించారు.