రోడ్డు విస్తరణ పనులు, రైల్వే ట్రాకుల పనుల్లో భాగంగా నిర్మాణాలను తొలగించడం సాధారణమే. అయితే ఇలాగే ఓ చోట రైల్వే ట్రాక్ పనుల్లో భాగంగా ఓ ఆలయాన్ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
మన దేశంలో గ్రామానికో ఆలయమైనా ఉంటుంది. ఇక పట్టణాలు, సిటీల్లో అయితే గల్లీకో గుడి కనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు రోడ్డు విస్తరణ పనుల్లో దేవాలయాలను తొలగించాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. రైల్వే ట్రాకుల పనుల్లోనూ ఇలాంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. బిహార్‌లోని ఓ రైల్వే ట్రాక్ పనుల్లో ఇలాగే జరిగింది. అక్కడ ఓ ప్రసిద్ధ ఆలయం ఉంది. ఆ గుడి రైల్వే ట్రాక్ పక్కనే ఉంది. అయితే ఈ రూట్లో కొత్త ట్రాక్ వేసేందుకు దేవాలయాన్ని తొలగించాల్సి వచ్చింది. దీంతో అధికారులు ఆ ఆలయాన్ని కూల్చేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ అలా చేసిన ప్రతిసారీ అనుకోకుండా ఏదో ఒక అవాంఛనీయ ఘటన జరిగేది. ఆ ఆలయం ఎంతో మహిమాన్వితమైనదని రైల్వే అధికారులు గుర్తించారు. కూల్చివేత పనులు ఆపవేసి దానిని అలాగే వదిలేశారు. ఆ గుడిని తిరిగి అక్కడే పునర్నిర్మించారు.
అదే బుఢియా మయీ మందిరం. ఇది ప్రా జంక్షన్‌కు సమీపంలో ఉంది. ఈ ఆలయం ఉన్న భూమి రైల్వే శాఖ పరిధిలోకి వస్తుంది. బుఢియా మయీ ఆలయానికి గోరఖ్‌పూర్, సివాన్, గోపాల్‌గంజ్ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడి బుఢియా అమ్మవారిని దర్శించుకుంటే.. కోరిన కోరికలు నెరవేరుతాయని స్థానికులు బలంగా నమ్ముతారు. స్థానిక ప్రజలే కాకుండా రైల్వే పరిపాలన అధికారులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. ఈ గుడి ప్రాంగణంలో రావి, వేప చెట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. వీటి మీద పెద్ద సంఖ్యలో పక్షులు నివసిస్తాయి. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. అయితే కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం వల్ల.. బుఢియా మయీ గుడిని కూల్చాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు.
ఈ క్రమంలో ఆలయ కూల్చివేతకు కొన్నిసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. దేవాలయాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక అవాంఛనీయ ఘటన జరిగేది. ఒకసారి ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టును అధికారులు నరికేశారు. వెంటనే ఆ చెట్టు నుంచి రక్తం రావడం మొదలైంది. దీంతో అందరూ షాకయ్యారు. అక్కడి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. చెట్టు నుంచి రక్తం కారడం చూసి.. రైల్వే ఎంప్లాయీస్ ఆలయ కూల్చివేత పనులను వెంటనే నిలిపివేశారు. ధ్వంసమైన గుడిని పునర్నిర్మించారు. అప్పటి నుంచి ఆ గుడి అక్కడే ఉంది. ట్రాక్ వల్ల దేవాలయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా దాన్ని దారి మళ్లించారు. ఈ ఘటన తర్వాత బుఢియా మయీని దర్శించుకునే వారి సంఖ్య మరింతగా పెరగడం గమనార్హం.