దేశ ప్రజలకు రక్షణగా ఉండాల్సిన అధికారి, అదే ప్రజలను మోసం చేశాడు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) ఉన్నతాధికారిగా పనిచేసిన ఓ వ్యక్తి ఈ భారీ మోసానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా.. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. చివరికి అతని కారణంగా మోసపోయిన బాధితుల ఫిర్యాదుతో జైలుపాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మీ, పోలీసులు మీడియాకు వెల్లడించారు.
ఈ ఘటన గుర్గావ్ లో చోటుచేసుకుంది. ప్రజలను మోసం చేసిన నిందితుడు ప్రవీణ్ యాదవ్ 2012లో బీఎస్ఎఫ్ లో చేరాడు. అనంతరం అక్కడ డిప్యూటీ కమాండెంట్ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత డిప్యూటేషన్ పై నేషనల్ సెక్యూరిటీ గార్డ్(NSG)లోని కన్ స్ట్రక్షన్ విభాగంలో గతేడాది వరకు విధులు నిర్వహించాడు. ప్రవీణ్ స్టాక్ మార్కెట్లో అప్పుడప్పుడు డబ్బులు పెడుతుండేవాడు. ఈ క్రమంలో అది అలవాటుగా మారి.. తన ఆస్తినంతా స్టాక్ మార్కెట్లో పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగక అప్పులు తీసుకుని మరీ ట్రేడింగ్ చేశాడు. దీంతో భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఈ అప్పులను తీర్చేందుకు అడ్డదారులు తొక్కాడు.
దీనికోసం ప్రవీణ్ NSGకి పలు నిర్మాణాలు చేపట్టాలని నకిలీ టెండర్లు ప్రకటించాడు. ట్రాన్సెక్షన్లు జరపడం కోసం ఎన్ఎస్ జీ పేరుతో నకిలీ బ్యాంక్ ఖాతా తెరిచి.. రూ.125 కోట్ల వరకు వసూలు చేశాడు. తన మోసం బయటపడే లోపే దేశం విడిచి పారిపోవడం కోసం స్వచ్ఛంద పదవీ విరమణకు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో రెండు నెలలు గడిచినా నిర్మాణ పనులపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో కాంట్రాక్టర్లు.. ఎన్ఎస్ జీని సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. మోసపోయినట్లు గుర్తించిన కాంట్రాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రవీణ్ యాదవ్ ను అరెస్ట్ చేశారు. ఎన్ఎస్ జీలోనే పనిచేసే తన సోదరి సాయంతో ఈ మోసానికి పాల్పడ్డాడని తేల్చారు. యాదవ్ కు సహకరించిన దినేష్ అనే వ్యక్తిని కూడా పట్టుకున్నారు. వీరి నుంచి 10 వాహనాలతో పాటు రూ.13.8 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.