పెళ్లి కుమారుడు ఓ వింత కోరిక కోరాడు. అతడి కోరికను కాదనలేకపోయిన తల్లిదండ్రులు జేసీబీలో అతడ్ని పెళ్లి మండపానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పెళ్లంటే నూరేళ్ల పంట. వందేళ్లు గుర్తుండేలా పెళ్లి చేసుకోవాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. వెరైటీ వీడియోలు, ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్లు చేయించుకుంటూ ఉంటారు. బరాత్‌లు, డీజే డాన్సులతో పెళ్లిలో హంగామా చేస్తుంటారు. కొందరు అందరిలా కాకుండా కొన్ని వింత పోకడలతో వివాహ వేడుకను చేసుకుంటూ ఉంటారు. అలాంటి కోవలోనే ఓ వరుడు తన పెళ్లికి వింత పని చేశాడు. మండపంలోకి వినూత్నంగా అడుగుపెట్టాడు. అది అందరికీ క్రేజీ అనిపించింది.
ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒడిశాలో బౌద్ హర్భంగా బ్లాక్ లోని ఛతరంగ గ్రామంలో గంగాధర్ బెహరా అనే వ్యక్తికి సరస్వతి బెహరా అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఈ సందర్భంలో పెళ్లి ఊరేగింపు కార్యక్రమం జేసీబీలో చేయాలని గంగాధర్ కోరాడు. దీంతో అతని తమ్ముడు జేసీబీ ఆపరేటర్ కావడంతో జేసీబీని బరాత్ కొరకు అందంగా ముస్తాబు చేయమన్నాడు. అతడి కోరిక మేరకు.. జేసీబీ ముందు భాగంలో సోఫా సెట్‌లా ఏర్పాటు చేశారు.
పూలు, బెలూన్లు, అలంకరణ వస్తువులతో అందంగా డెకరేట్ చేశారు. గంగాధర్ జేసీబీ ముందు భాగంలో కూర్చోగా.. కుటుంబసభ్యులు, స్థానికులు ఊరేగింపుగా డాన్స్‌లు చేస్తూ కేరింతలతో మండపానికి వచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. గతంలో గుజరాత్లో కూడా ఇలాగే జేసీబీలో పెళ్లి కొడుకును ఊరేగించారు. మళ్లీ ఇప్పుడు ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. ఈ తంతు చూడడానికి జనం భారీ ఎత్తున వచ్చారు. ఈ వినూత్న బరాత్ ఐడియాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.