బ్రహ్మానందంకు చేదు అనుభవం ఎదురైంది. ఆ నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు ప్రచారం చేసినా కూడా ఆయన మద్దతిచ్చిన వ్యక్తి గెలవలేదు.
ఎన్నికల సమయంలో ప్రచారానికి సెలబ్రిటీలను తీసుకురావడం అనేది ఎప్పటి నుంచో ఉన్నదే. ఆయా పార్టీలు ఓటర్లను ఆకర్షించడం కోసం సినీ గ్లామర్ ను వినియోగించుకుంటాయి. సెలబ్రిటీలకు ఉన్న పాపులారిటీ కారణంగా నాలుగు ఓట్లను రాబట్టవచ్చునని పలు పార్టీలు ప్రచారంలో పలువురు నటులను భాగస్వామ్యం చేస్తుంటాయి. ఈ క్రమంలో టాలీవుడ్ పాపులర్ హాస్య నటుడు బ్రహ్మానందంను భారతీయ జనతా పార్టీ ప్రచారం కోసం వినియోగించుకుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థి తరపున బ్రహ్మానందం ప్రచారం చేశారు. భాజపా నేత, ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తరఫున చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు బ్రహ్మానందం ప్రచారం చేశారు.
అయితే ఊహించని విధంగా బ్రహ్మానందంకు చేదు అనుభవం ఎదురైంది. బ్రహ్మానందం ప్రచారం చేసిన స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓటమి చెందారు. 11,130 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఈశ్వర్ కు 69,008 ఓట్లు రాగా.. సుధాకర్ కు 57,878 ఓట్లు వచ్చాయి. మరోవైపు 13,300 ఓట్లతో జేడీఎస్ అభ్యర్థి కేపీ బచే గౌడ మూడవ స్థానంలో నిలిచారు. చిక్ బల్లాపూర్ నియోజకవర్గం మన ఆంధ్రప్రదేశ్ కు ఆనుకుని ఉంటుంది. ఈ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు అధికంగా ఉన్నారు.
తెలుగు ఓటర్లను ఆకర్షించడం కోసం తెలుగు నటుడు, సుపరిచితుడు అయినటువంటి బ్రహ్మానందంతో ప్రచారం చేయించారు. సుధాకర్, బ్రహ్మానందం ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ కారణంగానే గత ఎన్నికల్లోనూ సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం చేశారు. ఆ సమయంలో బ్రహ్మానందం మద్దతిచ్చిన సుధాకర్ గెలిచారు. అదే సెంటిమెంట్ ఇప్పుడు కూడా వర్కవుట్ అవుతుందని అనుకున్నారు. ఆ సెంటిమెంట్ ని రిపీట్ చేయాలనీ బ్రహ్మానందంను మరోసారి రంగంలోకి దించారు. నాలుగు రోజులు బ్రహ్మానందం ప్రచారం చేసినా గానీ ఫలితం లేకుండా పోయింది.