వృక్షో రక్షతి రక్షితః అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం. చెట్టు విలువ ఏంటో తెలిసిన వారు.. చెట్లను అమితంగా ప్రేమిస్తారు. చెట్లు ఉంటేనే భూమిపై జీవి మనుగడ సాధ్యమవుతుంది. లేదంటే జీవం అంతమయ్యే ప్రమాదం ఉంది. అయినా కొంత మంది చెట్లను నరికివేస్తూ భవిష్యత్ కి ముప్పు చేకూర్చుతున్నారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోనే ని రైసెన్ జిల్లా. భోపాల్ దగ్గర్లోని సాంచి, సలామత్ పుర మధ్య ఉన్న చిన్న గుట్ట మీద ఓ వీవీఐపీ చెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ ఎప్పుడూ పటిష్టమైన భధ్రత ఉంటుంది. 24 గంటలూ చెట్టు దగ్గర ముగ్గురి నుంచి ఐదుగురు పహారా కాస్తుంటారు. ఎవర్నీ ఆ చెట్టు దగ్గరకు అనుమతించరు. వీఐపీలు, వీవీఐపీలు కంచెదాటి చెట్టు వద్దకు వెళ్లాలన్నా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సిందే. అంతేకాదు.. ఒక్క ఆకు రాలినా ఆ రోజు అధికారులకు కంటిమీద నిద్ర కరువే అని చెప్పాలి. ఇంతకీ ఆ చెట్టు ఏంటో తెలుసా? అదే బోది చెట్టు.
చరిత్రలో బౌద్ధ విశ్వవిద్యాలయం నిర్మితమైన సలామత్ కొండపై ఈ బోధి చెట్టును నాటగా.. అది కాస్తా 15 అడుగుల మేరకు పెరిగింది. ఈ చెట్టును రక్షించేందుకు ఐదుగురు భద్రతా సిబ్బంది నిరంతరం అక్కడ కాపలా ఉంటారు. ఇక ఈ చెట్టును ప్రతీ 15 రోజులకు ఒకసారి వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేసి.. దాని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. దాని ఆరోగ్య పరిస్థితి గురించి సమీక్ష చేస్తారు. ఇలా ఈ చెట్టు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతోంది ప్రభుత్వం. గౌతముడికి రావి చెట్టు కిందే జ్ఞానోదయం అయ్యి బుద్ధుడయ్యాడు.అందుకే బౌద్ధులు రావిచెట్టుకుని బోధి చెట్టు అంటారు. ఈ బోధి వృక్షాన్ని సెప్టెంబర్ 21, 2012 సంవత్సరంలో అప్పుడు శ్రీలంక అధ్యక్షుడుగా ఉన్న మహింద రాజపక్స నాటారు. బౌద్ధ మత గ్రంథాల ప్రకారం.. బుద్దుడు బోధ్ గయలోని బోధి చెట్టు కిందే జ్ఞానోదయం పొందాడు. అశోక చక్రవర్తి కూడా బోధి చెట్టు కిందే ఆశ్రయం పొందాడు. అందుకే ఈ బోధి చెట్టుకు పటిష్టమైన భధ్రత ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు.
ఈ చెట్టు నిర్వహణ కోసం ప్రతీ సంవత్సరం 12 నుంచి 15 లక్షల రూపాయల మేర ఖర్చు అవుతుందట. కాగా, ఈ చెట్టును చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తారట. ఈ బోది చెట్టుకు సాంచి నగర పాలికే నుంచి ప్రత్యేకమైన ట్యాంకులో నీటినే ఉపయోగిస్తారు. ఇక బుద్ధునికి జ్జానోదయం అయిన బోధి చెట్టు చిన్న కొమ్మను క్రీస్తు పూర్వం 3వ శతబ్దంలో భారత్ నుంచి శ్రీలంకకు తీసుకువెళ్లారు. అక్కడ అనురాధాపురం లో నాటి సంరక్షించారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. కాగా, ఈ చెట్టును చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తారట. ప్రస్తుతం కరోనా కావడంతో.. పర్యాటకుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు.