ఆ మధ్య హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ నాథన్ ఆండర్సన్ ఒకే ఒక్క నివేదికతో టాప్ పొజిషన్ లో అదానీని పాతాళానికి పడిపోయేలా చేశాడు. తాజాగా ఒక యువకుడు ఏకంగా ప్రపంచ కుబేరులైన బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్, ముకేశ్ అంబానీ వంటి వారిని తీసుకొచ్చి మురికివాడలో పడేశాడు. అయితే నాథన్ ఆండర్సన్ కి, ఈ యువకుడి చాలా తేడా ఉంది.
ఓడలు బండ్లు అవుతాయని, బండ్లు ఓడలు అవుతాయన్న సామెత ఉంది. ఎవరు ఎప్పుడు మిలియనీర్ అవుతారో, ఎప్పుడు ఎవరు అంతా కోల్పోతారో అంచనా వేయలేని పరిస్థితి. ఇటీవల ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10లో, భారత్ లో నంబర్ వన్ సంపన్నుడిగా ఉన్న గౌతమ్ అదానీ ఒక్కసారిగా టాప్ 10 జాబితాలోంచి పడిపోయారు. తాజాగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ వంటి సంపన్నులు నిరుపేదలుగా మారిపోయారు. మాసిన బట్టలు, చిత్తు కాగితాల మధ్య నిలబడి వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిల్ గేట్స్ కైతే ఒంటి మీద చొక్కా కూడా లేదు. అంత దయనీయ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి?
ఈ ప్రపంచ కుబేరులు ఫోటోల్లో ఇలా దయనీయ స్థితిలో ఉండడానికి కారణం.. ఒక యువకుడు. గోకుల్ పిళ్ళై అనే యువకుడు కోటీశ్వరులను నిరుపేదలుగా మార్చేస్తున్నారు. మిలియనీర్స్ ని స్లమ్ లో చూడాలని, చెత్త కుప్పల మధ్య నిలబడితే చూడాలని చెప్పి మిడ్ జర్నీ అనే ఏఐ టెక్నాలజీ ద్వారా గోకుల్ పిళ్ళై అనే కళాకారుడు ఇలా మార్ఫింగ్ చేసి ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, మార్క్ జుకర్ బర్గ్, ముకేశ్ అంబానీ వంటి ప్రముఖుల ఫోటోలను అప్లోడ్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ నిక్కరు, బనియన్ వేసుకొని ఒక పాతబడిన రేకుల షెడ్డు దగ్గర నిలబడి దీనంగా చూస్తున్నారు. బిల్ గేట్స్ అయితే అన్నం తిని చాలా రోజులైంది అన్నట్టు ఉన్నారు. మురికివాడలో దయనీయ స్థితిలో ఉన్నారు.
ఇదే బాటలో ముకేశ్ అంబానీ కూడా ఉన్నారు. కాకపోతే అంబానీకి ఆ కళాకారుడు ప్యాంట్ వేశాడు. ఈ ఫోటోలో ముకేశ్ అంబానీ మాసిన బట్టలు ధరించి చెత్త కాగితాల మధ్య ఉన్నారు. ఇదే కోవలో మార్క్ జుకర్ బర్గ్, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ ఫోటోలను గోకుల్ పిళ్ళై తన ఖాతాలో షేర్ చేసి.. ‘స్లమ్ డాగ్ మిలియనీర్స్.. ఇంకా ఎవరైనా మిస్ అయ్యారా ఈ జాబితాలో’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది గోకుల్ పిళ్ళై టాలెంట్ ని మెచ్చుకుంటున్నారు. ఇతని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇలాంటి కళకు సంబంధించిన అనేక ఫోటోలు ఉన్నాయి. అవన్నీ ఎంతగానో నెటిజన్స్ ని ఆకర్షిస్తున్నాయి. మరి గోకుల్ పిళ్ళై టాలెంట్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.