కుర్రకారుకు బ్రేకులు వేయడం కాస్త కష్టమనే చెప్పాలి. ప్రస్తుతం కొందరు యువకులు చేస్తున్న గోల అంతా ఇంతా కాదు. ఇంక వారి చేతిలో బైకుంటే.. అదికూడా బుల్లెట్ అయ్యుంటే వారిని ఎవరు ఆపగలరు? అలా రోడ్డుపై పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఇద్దరు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. చేతిలో బండి ఉందిగా అని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బుల్లెట్ బండిపై హీరోలు కావాలి అనుకున్నారు. కానీ, డివైడర్ కు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. వారికి జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం విజయనగర్ హోస్పేట్ లో జరిగింది. చిత్తవాడ్గీ సమీపంలో రోడ్డుపై కొందరు యువకులు ద్విచక్రవాహనాలతో కేరింతలు కొడుతూ వస్తున్నారు. వారు ఏదైనా ర్యాలీ చేస్తున్నారా? లేక సరదాగా వెళ్తున్నారా అనే విషయం తెలియదు. ఓ కుర్రాడు ఒక్కసారిగా బుల్లెట్ వేగం పెంచి హీరో అయిపోదాం అనుకున్నాడు. కానీ, ఆ వేగంలో బుల్లెట్ ని కంట్రోల్ చేయలేక డివైడర్ ఎక్కించేశాడు. బుల్లెట్ బోల్తాపడటంతో రైడర్ డివైడర్ పై పడ్డాడు.. వెనుక కూర్చున్న కుర్రాడు మాత్రం రోడ్డుపై పడిపోయాడు. అతనిపైకి బైకు కూడా ఎక్కినట్లు కనిపించింది.
ఈ వీడియో కన్నడ డైలీ ప్రజావాణికి చెందిన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వెనుక కూర్చున్న కుర్రాడికి తీవ్ర గాయాలు అయినట్లు నెటిజన్లు కొందరు కామెంట్ చేశారు. వారి నిర్లక్ష్యం చూసి వారికి దెబ్బలు తగిలినా కూడా ఎవరూ అయ్యో అనకపోగా తిట్టడం మొదలు పెట్టారు. వారికి ప్రాణాలంటే లెక్కలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు ఖరీదైన బైకులు కొని బలాదూరుకు పంపుతున్న తల్లిదండ్రులను అనాలంటూ పెదవి విరుస్తున్నారు. రోడ్డుపై స్టంట్లు చేస్తూ ఇలా ప్రవర్తిస్తారా? ఏంటి ఆ పిచ్చి వేషాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ಹೊಸಪೇಟೆ (ವಿಜಯನಗರ): ಅತಿ ವೇಗವಾಗಿ ಸಿನಿಮಾ ಶೈಲಿಯಲ್ಲಿ ಬೈಕ್ ಸ್ಟಂಟ್ ಮಾಡಲು ಹೋಗಿ ಅಪಘಾತ ಮಾಡಿಕೊಂಡಿರುವ ಘಟನೆ ನಗರದ ಚಿತ್ತವಾಡ್ಗಿ ಬಳಿ ಮಂಗಳವಾರ ನಡೆದಿದೆ. #RoadAccident pic.twitter.com/1SdwQMJt3U
— Prajavani (@prajavani) January 24, 2023