బానెట్ మీద ఒక మనిషి చిక్కుకున్నా కారును అలాగే పోనిచ్చాడు డ్రైవర్. బాధితుడు కారు ఆపాలని ఎంత మొత్తుకున్నా వినలేదు. బండిని అలాగే మూడు కిలో మీటర్లు పోనిచ్చాడు.
ఒక క్యాబ్ డ్రైవర్‌ను కారు బానెట్ మీద కిలోమీటర్ల కొద్దీ ఈడ్చుకెళ్లిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఢిల్లీలో ఓ కారు ఆశ్రమ్ చౌక్ నుంచి నిజాముద్దీన్ దర్గా వైపు వెళ్తోంది. ఆ టైమ్‌లో ఆ కారు బానెట్‌పై ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే డ్రైవర్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా మూడు కిలోమీటర్ల వరకు కారును అలాగే పోనిచ్చాడు. కారుపై మనిషి ఉన్న సంగతిని గమనించిన పోలీసులు ఓవర్ టేక్ చేసి ఆ వాహనాన్ని ఆపారు. ఆ కారు నడిపిన వ్యక్తి పేరు రామచంద్ర అని పోలీసులు తెలిపారు. అతడిపై ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేశామన్నారు. ఆ కారు బిహార్ ఎంపీ వీనాదేవికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కారును పట్టుకున్న సమయంలో అందులో ఎంపీ లేరని సమాచారం.
ఈ ఘటనలో బాధితుడి పేరు చేతన్. అతడు క్యాబ్ డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. ఒక ప్యాసింజర్‌ను దింపి వస్తుండగా చేతన్ క్యాబ్‌ను ఎంపీ కారు డ్రైవర్ మూడుసార్లు ఢీకొట్టాడు. దీంతో అతడు కారు దిగి.. ఎంపీ కారుకు అడ్డంగా నిలబడ్డాడు. అయితే వెంటనే ఆ కారు డ్రైవర్ వేగాన్ని పెంచి చేతన్‌ను ఢీకొట్టాడు. దీంతో అతడు బానెట్‌పై పడిపోయాడు. కారు ఆపాలని చేతన్ ఎంత బతిమిలాడినా ఎంపీ కారు డ్రైవర్ పట్టించుకోలేదు. పోలీసులు గమనించి కారును ఓవర్ టేక్ చేసి ఆపడంతో అతడు బయటపడ్డాడు. ఎంపీ కారు డ్రైవర్ పూర్తిగా తాగున్నాడని చేతన్ చెప్పుకొచ్చాడు. మరోవైపు నిందితుడు ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు. క్యాబ్ డ్రైవర్ కావాలని బానెట్ పైకి దూకాడని చెప్పాడు.