తెలంగాణలోని హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌తో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 29 అసెంబ్లీ స్థానాలకు, 3 లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో, అత్యధిక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ ఉప ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 29 స్థానాల్లో కేవలం 7 స్థానాల్లో మాత్రమే బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం బీజేపీ కంచుకోట లాంటిది. గత ఎన్నికల్లో మండీలో దాదాపు 4,05,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రామ్ స్వరూప్ శర్మ ఘన విజయం సాధించారు. ప్రతిష్టాత్మకమైన ఈ స్థానాన్ని ఈసారి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ప్రతిభాసింగ్.. కార్గిల్ యుద్ధవీరుడు, బీజేపీ అభ్యర్థి, బ్రిగేడియర్ ఖుషాల్ ఠాకూర్‌ను ఓడించారు. 7,490 ఓట్ల మెజారిటీతో ప్రతిభాసింగ్ చరిత్రను తిరగరాశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సొంత జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో గెలిచి కాంగ్రెస్ తన సత్తా చాటింది. బీజేపీ కోటను బద్ధలు కొట్టిన ప్రతిభాసింగ్ హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత, దివంగత వీరభద్రసింగ్ సింగ్ సతీమణి.
హిమాచల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గతంలో బీజేపీ ఖాతాలో ఉన్న జబ్బల్–కోత్‌ఖాయ్ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి నీలం సెరాయిక్‌కు కేవలం 2,644 ఓట్లు పొంది డిపాజిట్ కోల్పోయారు. కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీలో బీజేపీ అభ్యర్థి మహేష్ గవిట్‌పై శివసేన మహిళా అభ్యర్థి కలాబెన్ దేల్కర్ విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా లోక్‌సభ స్థానాన్ని మాత్రం బీజేపీ నిలబెట్టుకుంది. అలాగే పశ్చిమ బెంగాల్‌లో 4 స్థానాల్లో టీఎంసీనే విజయం సాధించింది. కర్ణాటకలో 2 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ చెరొకటి గెలిచాయి. మధ్యప్రదేశ్‌లో 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా రెండు కాంగ్రెస్ స్థానాలను బీజేపీ, బీజేపీ ఒక సీటును కాంగ్రెస్ గెలుచుకున్నాయి. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని మేఘాలయ డెమొక్రటిక్ కూటమి మొత్తం మూడు సీట్లనూ కైవసం చేసుకుంది.
బిహార్‌లో రెండు చోట్లా జేడీ(యూ) అభ్యర్థులే గెలుపొందారు. రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్ ఒక స్థానాన్ని కాపాడుకోవడంతోపాటు మరో సీటు గెల్చుకుంది. మహారాష్ట్రలోని నాందేఢ్ జిల్లాలోని దెగ్లూ్లర్(ఎస్‌సీ) స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జితేశ్ రావ్‌సాహెబ్ గెలిచారు. హరియాణా రాష్ట్రంలోని ఎల్లెనాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అభ్యర్థి అభయ్ సింగ్ చౌతాలా విజయం సాధించారు. మిజోరంలో తురియల్ స్థానంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్) అభ్యర్థి లాల్‌దాంగ్‌లియానా గెలిచారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో హుజూరాబాద్ బీజేపీ, బద్వేల్ వైసీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురైన ఓటములపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.