ఏ తండ్రికీ రాకూడని కష్టం ఆ తండ్రికి వచ్చింది. చనిపోయిన కూతురి శవాన్ని దూరంగా ఉన్న తన ఊరికి తీసుకెళ్లడానికి ఏ వాహనం దొరకలేదు. దీంతో బైకుపై వేసుకుని ఊరికి వెళ్లాడు.
ప్రతీ మనిషి జీవితంలో కష్టాలు అనేవి సర్వ సాధారణం. అయితే, కుటుంబ సభ్యులను దూరం చేసుకున్నపుడు ఆ కష్టం పదింతలు అవుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో.. పిల్లలను కోల్పోటం అన్న బాధ నరక ప్రాయమే. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు చనిపోయినపుడు ఆ తల్లిదండ్రులు పడే బాధను మాటల్లో వర్ణించటం చాలా కష్టం. తాజాగా, కష్టానికే కన్నీళ్లు తెప్పించే ఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చనిపోయిన కూతుర్ని ఇంటికి తీసుకెళ్లటానికి ఓ తండ్రికి అంబులెన్స్ దొరకలేదు. దీంతో ఆయన బైకుపై తన కూతురి శవాన్ని ఇంటికి తీసుకెళ్లాడు.
కూతురు శవంతో ఆ బైకుపై దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌లోని షహ్‌దోల్, కోత గ్రామానికి చెందిన లక్ష్మణ్ సింగ్ కూతురు మాధురి కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి మాధురి చికిత్స పొందుతూ చనిపోయింది. మాధురి మరణంతో ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా కృంగిపోయారు. ఇక, కూతురి శవాన్ని ఊరికి తీసుకెళ్లటానికి లక్ష్మణ్ అంబులెన్స్ కావాలని అడిగాడు. అయితే, అంబులెన్స్ ఇవ్వటం కుదరదని ఆసుపత్రి అధికారులు తేల్చి చెప్పారు.
15 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న ఊర్లకు అంబులెన్స్ సౌకర్యం లేదన్నారు. దీంతో లక్ష్మణ్ తన కూతురి శవాన్ని బైకుపై తీసుకెళ్లటానికి నిశ్చయించుకున్నాడు. దాదాపు 70 కిలోమీటర్లు బైకుపై ప్రయాణించి కూతుర్ని ఇంటికి తీసుకెళ్లాడు. లక్ష్మణ్ తన కూతురి శవాన్ని బైకుపై తీసుకెళుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆసుపత్రి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తండ్రి పడ్డ బాధకు కంటతడి పెడుతున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.