భోపాల్ గ్యాస్ విషాదం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో గ్యాస్ లీకై అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు అదనంగా పరిహారం ఇవ్వాలని కేంద్రం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
భోపాల్ గ్యాస్ విషాదం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో గ్యాస్ లీకై అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 1984 డిసెంబర్ 3న అర్ధరాత్రి సమయంలో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ రసాయనాల ప్లాంట్ నుంచి 40 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ అనే విష వాయువు లీకై 8 వేల మంది చనిపోయారు. 5 లక్షలకు పైగా జనం విష వాయువు ప్రభావానికి గురయ్యారు. ప్రపంచంలోని అతి దారుణమైన పారిశ్రామిక విప్పత్తులలో ఇదొకటిగా పరిగణించారు. అయితే ఈ దుర్ఘటనకు సంబంధించి బాధితులకు సుదీర్ఘకాలంగా న్యాయం జరగలేదు. ఈ దుర్ఘటన జరిగి 39 ఏళ్ళు అయినప్పటికీ మరణాల సంఖ్య, బాధితుల విషయంలో ఇంకా ఆందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ దుర్ఘటనలో ఎంతమంది చనిపోయారు? ఎంతమంది విషవాయువు బారిన పడ్డారన్న దానిపై స్పష్టత లేదు. ప్రమాద గణాంకాలపై ఉన్న అస్పష్టతపై భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల తరపున పలు సంఘాలు ఆందోళనలు చేపడుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం బాధితులకు పరిహారం ఇవ్వాలని కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులో యూనియన్ కార్బైడ్ యాజమాన్యం నుంచి అదనపు పరిహారం కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ యాజమాన్యంలోని కంపెనీల నుంచి రూ. 7,884 కోట్ల అదనపు పరిహారం చెల్లించాలని కేంద్రం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 1989లో సెటిల్మెంట్ సమయంలో మానవ జీవితాలకు, పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారని కేంద్ర ప్రభుత్వం వాదించింది. అయితే గ్యాస్ లీక్ దుర్ఘటన విషయంలో 1989 నుంచి గతంలో జరిగిన, ప్రస్తుతం జరిగే, భవిష్యత్తులో జరగబోయే అనర్థాలకు కంపెనీతో అప్పటి ప్రభుత్వం 470 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్ చేసుకుందని సుప్రీంకోర్టు ధర్మాసనం జనవరి 12న తెలిపింది.
ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సెటిల్మెంట్ ను మళ్ళీ చేయడం కోసం కేసు రీఓపెన్ చేస్తే అది సెటిల్మెంట్ యొక్క పవిత్రతకు భంగం కలుగుతుందని ధర్మాసనం వెల్లడించింది. మంగళవారం ఐదుగురు జడ్జిలు కలిగిన ధర్మాసనం మరోసారి ఈ దుర్ఘటనకు సంబంధించిన కేసుపై తన తీర్పును వెల్లడించింది. అన్ని సెటిల్మెంట్లు బాధితుల ప్రస్తుత, భవిష్యత్తు వాదనలకు సరిపోతుందని ధర్మాసనం న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ వెల్లడించారు. అయితే బాధితుల కోసం పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ ని సంతృప్తిపరచడానికి ఆర్బీఐ వద్ద ఉన్న రూ. 50 కోట్లను ప్రభుత్వం వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. మరి భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు అదనపు పరిహారం ఇవ్వాలని కేంద్రం వేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.