దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటేందుకు రైల్వే శాఖ ‘భారత్ గౌరవ్’ పేరుతో ప్రత్యేక పర్యాటక రైళ్లను ప్రవేశపెట్టింది. కానీ ఈ రైళ్లకు ఆశించినంత స్థాయిలో డిమాండ్ లభించకపోవడంతో ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టికెట్ ధరలు ఎక్కువగా ఉండడం వల్లే జనం ఆసక్తి చూపడం లేదని.. టికెట్ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రైళ్ల టికెట్ల ధరను దాదాపు 30 శాతం తగ్గించాలని ఐఆర్సీటీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారతదేశ సాంస్కృతిక, వారసత్వ, ప్రముఖ చారిత్రక కట్టడాలు, ప్రముఖ చారిత్రక ప్రదేశాలు, ముఖ్యమైన యాత్ర స్థలాలు, విశేషాలను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో రైల్వేశాఖ గత ఏడాది ‘భారత్ గౌరవ్’ రైళ్లను ప్రారంభించింది.
రామాయణ్ సర్క్యూట్ కింద ఢిల్లీలోని సఫ్ధార్ జంగ్ రైల్వేస్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరి.. దేశంలోని పలు చారిత్రక ప్రదేశాలను చుట్టుముట్టి నేపాల్ కి చేరుకుంటుంది. మొత్తం 18 రోజుల పాటు ఈ ప్రయాణం సాగుతుంది. అయితే మొదట ఏ 18 రోజుల ప్రయాణానికి థర్డ్ ఏసీ క్లాస్ టికెట్ ధర రూ. 62 వేలు ఉండేది. ధర ఎక్కువ ఉండడం కారణంగా డిమాండ్ తగ్గింది. అంతేకాదు 15 ఏళ్ల నాటి ఐసీఎఫ్ కోచ్ ల వల్ల కూడా ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారట. అందుకే టికెట్ ధరలు తగ్గించాలని ఐఆర్సీటీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టికెట్ల ధరను కనీసం 20-30 శాతం తగ్గించాలని యోచిస్తున్నారు. ఇక ఇటీవల భారత్ దర్శన్ రైళ్లను ప్రారంభించిన ఐఆర్సీటీసీ.. ఒకరోజు యాత్రకి స్లీపర్ టికెట్ ధర రూ. 900, థర్డ్ ఏసీ క్లాస్ టికెట్ ధర రూ. 1500గా ఉంచింది. 18 రోజుల ప్రయాణానికి రూ. 27 వేల కంటే ఎక్కువ అవ్వదు. కాబట్టి ప్రయాణికులు భారత్ దర్శన్ రైళ్లకే ఎక్కువ ఆసక్తి చూపుతారని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.