ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పబ్ జీ గేమ్ ఎంతగా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ ఆటలో లీనం అయి జీవితాలు నాశనం చేసుకుంటున్నవారు ఎంతో మంది ఉన్నారు. పబ్‌జీ ఆట కోసం ఓ బాలుడు రైలుని రెండు గంటల పాటు ఆపించాడు. ఈ ఘటన బెంగళూరులోని యలహంక రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. బాలుడు చేసిన ఆకతాయి పని వల్ల పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. వివరాల్లోకి వెళితే..
బెంగళూరులోని యలహంక రైల్వే స్టేషన్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామని, అది ఏ క్షణాన్నైనా పేలొచ్చన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. స్టేషన్ కి వచ్చిన రైళ్లను ఆపి బాంబ్ స్క్వాడ్‌తో కలిసి తనిఖీలు చేపట్టారు. స్టేషన్ మొత్తం జల్లెడ పట్టినా బాంబు జాడ కనిపించలేదు. మొత్తానికి ఫోన్ కాల్ ఉత్తుత్తి బెదిరింపుగా గుర్తించారు. అయితే ఫోన్ ఎవరు చేశారన్న విషయంపై దృష్టి పెట్టారు. విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి.. ఆ ఫోన్ కాల్ చేసింది కేవలం పన్నెండేళ్ల బాలుడు అని గుర్తించారు.
తనతో పబ్ జీ గేమ్ ఆడుతున్న స్నేహితుడు వేరే ఊరికి వెళ్తున్నాడని.. తన స్నేహితుడు మద్యలో వెళ్లిపోతే గేమ్ ఆగిపోతుందని భావించి స్టేషన్ లో బాంబు ఉందని ఫేక్ కాల్ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ విషయం విన్న పోలీసులు మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ బాలుడు పబ్ జీ ఆటకు ఎంతగా బానిస అయ్యాడో తెలిసిపోతుందని.. అతడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసు పెట్టకుండా హెచ్చరించి వదిలేశారు.