బెంగళరూలో కురిసిన భారీ వర్షాల కారణంగా యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, తెలుగు యువతి భానురేఖ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యక్ష సాక్షులు చెప్పింది వింటే.. నిర్లక్ష్యంగా భానురేఖను చంపేశారా అన్న సందేహం తెర మీదకు వస్తోంది. ఆ వివరాలు..
బెంగుళూరులో కురిసిన భారీ వర్షాల కారణంగా తెలుగమ్మాయి, యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భానురేఖ మృతి చెందిన సంగతి తెలిసిందే. అండర్‌పాస్‌లోకి భారీగా వరద నీరు చేరడం.. కారు మునిగి పోవడంతో.. భానురేఖ మృత్యువాత పడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి.. ఇలా అర్ధాంతరంగా కన్ను మూయడాన్ని ఆమె బంధువులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. సరదాగా బెంగళూరు చూద్దామని కారులో బయలుదేరిన భానురేఖ.. ఇలా మృత్యువాత పడటం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. విషయం తెలిసిన వెంటనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. ఆస్పత్రికి వెళ్లి.. భానురేఖ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే భానురేఖ మృతిపై అనేక ప్రశ్నలు, సందేహాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు..
కృష్ణాజిల్లాకు చెందిన భానురేఖ.. ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో జాబ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం కుటుంబంతో కలిసి బెంగళూరు చూడాలని భావించింది. తనతో పాటు మరో ఐదుగురు కుటుంబ సభ్యులు.. మొత్తం ఆరుగురు.. వెళ్లాలని నిర్ణయించుకున్నారు. క్యాబ్ బుక్ చేసుకుని బయల్దేరారు. అయితే వీరు కేఆర్ సర్కిల్ అండర్ పాస్ వద్దకు చేరుకునే సరికి.. అక్కడికి భారీగా వరద నీరు చేరింది. అప్పటికే ప్రమాదాన్ని అంచనా వేసి.. ఆగిపోయి ఉంటే.. ఇంత నష్టం జరిగుండేది కాదు.
కానీ క్యాబ్ డ్రైవర్ ఏం కాదన్నట్లు దూకుడుగా ముందుకు వెళ్లాలని భావించాడు. అలా కారు అండర్ పాస్ మధ్యలోకి రాగానే.. ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. ప్రమాదాన్ని గమనించిన భానురేఖ కుటుంబ సభ్యులు సాయం కోసం కేకలు వేయసాగారు. కారు నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ లోపు వీరిని గమనించిన కొందరు.. చీర, తాడు వంటివి విసిరి వాళ్లను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే అండర్‌పాస్‌లోకి నీటి ప్రవాహం పెరగడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని.. క్యాబ్‌లో చిక్కుకుని.. నీటిలో మునిగిపోయిన భానురేఖ కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని కాపాడారు. ఆ తర్వాత నిచ్చెన ద్వారా అందరినీ బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే భాను రేఖ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. డ్రైవర్ ఒక్క నిమిషం అక్కడే ఆగి ఉంటే ఈ ప్రమాదం జరిగ ఉండేది కాదు అన్నారు ప్రత్యక్ష సాక్షులు.
సహాయక సిబ్బంది.. భాను రేఖను క్యాబ్ నుంచి బయటకు తీసుకువచ్చాక వెంటనే సమీపంలోకి సెయింట్ మార్తా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె కొన ఊపిరితో ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భానురేఖను ఆస్పత్రికి తీసుకువచ్చాక వైద్యులు ఆమెకు చికిత్స అందించడానికి నిరాకరించారని.. ప్రత్యక్ష సాక్షులు కొందరు ఆస్పత్రికి వచ్చిన సిద్ధరామయ్యకు ఫిర్యాదు చేశారు. ఆయన ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. దర్యాప్తు జరిపి.. రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కానీ ఆస్పత్రి వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి. భానురేఖను ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే ఆమె మృతి చెందింది అంటున్నారు. ఏది ఏమైనా క్యాబ్ డ్రైవర్ కాస్త జాగ్రత్తగా వ్యవహరించి ఉండి ఉంటే.. భానురేఖ బతికుండేది.. ఆమె తల్లిదండ్రులకు గుండెకోత తప్పేది అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.