ప్రేమ అంటే ఏంటో డెఫినిషన్ తెలియని నిబ్బా, నిబ్బీలు ఉన్న ఈరోజుల్లో నిజమైన ప్రేమ అనేది ఒకటి ఉంటుందని, దానికి పరిమితులు ఉండవని నిరూపించే గొప్ప ప్రేమికుల గురించి మనం వింటూనే ఉన్నాం. ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ప్రేమ దేశాలు, ఖండాలు దాటి ప్రయాణం చేస్తుంది. రీసెంట్ గా ఆటోవాలాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విదేశీ యువతి, పల్లెటూరు వ్యక్తి కోసం ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చిన బ్రిటిష్ యువతి వంటి కథనాలు మనం విన్నాం, చదివాం. తాజాగా ఒక ఆస్ట్రేలియన్ యువకుడు.. ఒక సైకిల్ రిపేర్ చేసుకునే మెకానిక్ కూతురి ప్రేమ కోసం వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ భారత్ కి వచ్చాడు.
మధ్యప్రదేశ్ లోని మనవార్ కి చెందిన తబస్సుమ్ హుస్సేన్ ని, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ఉండే యాష్ హాన్స్ చైల్డ్ అనే యువకుడు డిసెంబర్ 18న ఆదివారం నాడు భారతీయ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. తబస్సుమ్ ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మొదలైంది వీరి ప్రేమ ప్రయాణం. తబస్సుమ్ తండ్రి సాదిక్ హుస్సేన్ బస్ స్టాప్ దగ్గర ఒక చిన్న సైకిల్ రిపేర్ షాప్ ని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మనవార్ లోని పటేల్ కాలనీలో నివసిస్తున్నాడు. ఈయనకి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు కాగా ఇద్దరి కూతుర్లకు వివాహం జరిగింది. కాగా తబస్సుమ్ బాగా చదివే అమ్మాయి కావడంతో 2016 లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. ఆమె ఉన్నత చదువుల కోసమని రూ. 45 లక్షల ఆర్థిక సహకారం అందించింది.
ఆ సహకారంతోనే ఆస్ట్రేలియా వెళ్ళింది. ఒక సంవత్సరం తర్వాత ఆమె ఉంటున్న ప్రదేశం నుంచి బ్రిస్బేన్ నగరానికి 2017లో షిఫ్ట్ అయ్యింది. తబస్సుమ్ చదివిన కాలేజ్ లో యాష్ సీనియర్. అలా ఈ ఇద్దరూ ఒకే కాలేజ్ లో పరిచయం చేసుకుని.. ప్రేమ పక్షులుగా మారారు. తబస్సుమ్ ప్రస్తుతం ఒక సంస్థలో సీనియర్ మేనేజర్ గా పని చేస్తుంది. అయితే మొదట్లో తబస్సుమ్ కి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదట. చదువుకునే రోజుల్లో యాష్ ని చూసి ప్రేమలో పడిందట. ముందు యాష్ తనను పెళ్లి చేసుకోమని అడిగాడని.. నో చెప్పకుండా ఉండలేకపోయానని తబస్సుమ్ వెల్లడించింది. ఈ ఇద్దరికీ ఆగస్ట్ 2న ఆస్ట్రేలియాలో లీగల్ గా వివాహం జరిగిందని తబస్సుమ్ సోదరుడు రెహాన్ హుస్సేన్ వెల్లడించాడు.
పెళ్లి చేసుకున్న తర్వాత తబస్సుమ్ కుటుంబాన్ని కలవడానికి భారత్ కి వచ్చాడు యాష్. ఆ సమయంలోనే భారతీయ సంస్కృతి, వంటకాలు, ఆతిధ్యం వంటి వాటికి విపరీతంగా ప్రభావితం అయ్యాడు. ఆ తర్వాత తబస్సుమ్ కుటుంబ సభ్యులు.. ఇండియాలో పక్కా సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ ఆదివారం వీరి వివాహం లాంఛనంగా జరిపించారు. వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారతీయ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యాష్ ని నెటిజన్లు అభినందిస్తున్నారు. మరి ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి మన దేశం వచ్చి మన సాంప్రదాయాలు మెచ్చి.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్న యాష్ పై మీ అభిప్రాయం ఏమిటి? పెళ్లి అంటే కులాలు, మతాలు, ప్రాంతాలు అని చూసుకునే సమాజం ఆఫ్ ఇండియాలో.. అవేమీ చూడకుండా పెళ్లి చేసుకున్న ఈ జంటపై.. అలానే వీరి ప్రేమని అర్థం చేసుకుని పెళ్లి చేసిన పెద్దలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.