సాంకేతికత ఎంత పెరిగినా మనిషికి అంతుపట్టని వింతలు ఈ లోకంలో కొకోల్లలు. చెట్టు నుంచి పాలు కారడం, ఒక జీవి కడుపులో మరో జీవి జన్మించడం వంటి వింతల గురించి విన్నాం.. చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన మరొకటి చోటు చేసుకుంది. ఓ బాలుడు ఒంటి మీద చర్మం లేకుండా.. ప్లాస్టిక్ పొరతో జన్మించాడు. ఆ చిన్నారిని చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆ వివరాలు..
మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళకు ఈ వింత శిశువు జన్మించాడు. పెద్ద వారితో పోలిస్తే.. చిన్నారుల చర్మం చాలా మృదువుగా, మెత్తగా ఉంటుంది. కానీ సదరు మహిళ జన్మనిచ్చిన శిశువు శరీరంపై చర్మం బదులుగా ప్లాస్టిక్ పొర ఉంది. భయపడిన తల్లిదండ్రులు దీని గురించి వైద్యులకు చెప్పడంతో వారు చిన్నారిని పరీక్షించి.. ఆ బాలుడు అరుదైన ‘కొలోడియన్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు.చిన్నారి కాళ్లు, చేతులతో పాటు శరీరం మొత్తం ప్లాస్టిక్ పొరలా ఉంది. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులను ప్లాస్టిక్ బేబీస్ అని కూడా పిలుస్తారు. కొలోడియన్ అనేది ప్రపంచంలోని అరుదైన వ్యాధులలో ఒకటి. ఇది తల్లిదండ్రుల కణాల్లో లోపాల కారణంగా వస్తుంది. రెండు క్రోమోజోమ్‌లకు సోకినట్లయితే పుట్టిన బిడ్డకు కొలోడియన్ వచ్చే అవకాశముంది. ఈ వ్యాధి వల్ల పిల్లల చర్మం ప్లాస్టిక్‌లా ఉంటుంది.
క్రమంగా పొర పగిలిపోవడం వల్ల.. భరించలేని నొప్పి ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగితే ప్రాణాలను కాపాడటం చాలా కష్టం. ఇంతకు ముందు రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఇలాంటి శిశువే జన్మించినట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచంలో ప్రతి 11 లక్షల మంది శిశువుల్లో ఒకరికి ఇది సోకుతుంది. ఎస్ ఎన్ సీ యూలో చికిత్స పొందుతున్న చిన్నారి ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. ఐతే అతడు ఎన్ని రోజులు బతుకుతాడో డాక్టర్లు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.