కొన్నిసార్లు మెషిన్లు కూడా తప్పులు చేస్తుంటాయి. వాషింగ్ మెషిన్లు అయినా, ఏటీఎం మెషిన్లు అయినా ఒక్కోసారి వాటికి కూడా బుర్ర సరిగా పని చేయదు. కోడింగ్ లోపం వల్ల ఒక పని చేయబోయి మరొక పని చేస్తాయి. కొంతమంది ఏటీఎంలకు వెళ్లి కొంత డబ్బు విత్ డ్రా చేయాలనుకుంటే.. అనుకున్న దాని కంటే ఎక్కువ డబ్బులు వచ్చిన సంఘటనలు గతంలో చాలానే చూసాం. జనాలు కూడా తమ డబ్బు కాదని తెలిసి కూడా కరువు గాళ్ళలా ఆ డబ్బులను పట్టుకుని వెళ్లిపోయారు. ఇటీవలే ఒక ఏటీఎంలో 500 ఎంటర్ చేస్తే రూ. 2500 వచ్చాయి. ఆ విషయం తెలిసిన జనం ఎగబడి మరీ డబ్బులు ఎత్తుకెళ్లారు. ఏటీఎంకి అంటే మతిపోయి ప్రవర్తించింది. మనుషులకైనా మన డబ్బు కాదన్న ఇంగితం ఉండాలిగా. ఉంటే సమాజం ఇలా ఎందుకుంటుందని అంటారా? అదీ నిజమేలెండి.
ఇలాంటి సంఘటనే మళ్ళీ చోటు చేసుకుంది. ఒక యువకుడు ఏటీఎంకు వెళ్లి.. 8 వేలు విత్ డ్రా చేస్తే ఏకంగా 20 వేలు వచ్చాయి. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై సమీపంలో అంబత్తూరులో చోటు చేసుకుంది. అంబత్తూరు బ్రాంచ్ కు చెందిన ఇండియన్ బ్యాంక్ ఏటీఎం నుంచి.. ఎంటర్ చేసిన మొత్తం కంటే అధికంగా డబ్బులు వచ్చాయి. ఒక ఖాతాదారుడు విత్ డ్రా చేసిన దాని కంటే అదనంగా 12 వేలు వచ్చాయి. అంబత్తూరుకు చెందిన బాల సుబ్రమణి అనే వ్యక్తి మూడు సార్లు 20 వేలు, 15 వేలు, 10 వేలు డ్రా చేసేందుకు ప్రయత్నించగా.. రాలేదు. నాల్గవ సారి 8 వేల రూపాయలు డ్రా చేసేందుకు యత్నించగా.. 20 వేలు వచ్చాయి.
ఇలానే తిరుముల్లైవైల్ కి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి 20 వేలు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా రాలేదు. దీంతో 8 వేలు ఎంటర్ చేయమని తోటి వ్యక్తి చెప్పడంతో 8 వేలు ఎంటర్ చేశారు. అయితే ఇతనికి కూడా 20 వేలు వచ్చాయి. ఇలా 10 మందికి పైగా ఖాతాదారులు 8 వేలు ఎంటర్ చేసి.. 20 వేలను డ్రా చేసుకున్నారు. అయితే వీరిలో కేవలం ఆరుగురు వ్యక్తులు అదనంగా వచ్చిన డబ్బులను బ్యాంకు వారికి ఇచ్చేసి తమ మర్యాదను, గౌరవాన్ని కాపాడుకున్నారు. మిగతా కరువు గాళ్ళు మాత్రం ఆ డబ్బులతో వెళ్లిపోయారు. అయితే బ్యాంకు వాళ్ళకి తెలియదా.. పట్టుకెళ్లిన వాళ్ళు ఎవరో అనేది.
అయితే బ్యాంకు సిబ్బంది పొరపాటున ఏటీఎం మెషిన్ లో 200 నోట్ల ట్రేలో 500 నోట్లను పెట్టడమే ఈ పొరపాటుకు కారణమని బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వెంటనే మెయింటెనెన్స్ బృందం వచ్చి ఏటీఎం టెక్నికల్ మాల్ ఫంక్షన్స్ ను ఫిక్స్ చేశారు. అదండీ విషయం.. ఏటీఎంలో పొరపాటున ఒక్కోసారి అదనంగా డబ్బు వస్తుంటాయి. కానీ తిరిగి బ్యాంకు వారికి చెప్పడం మంచి పద్ధతి. మీకు గనుక ఇలాంటి అనుభవం ఎదురైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి.