మన సమాజంలో పురుషుడు రెండో పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణంగా పరిగణిస్తారు. చాల మంది మగాళ్లు.. మొదటి భార్య ఉండగానే మరోకరిని వివాహం చేసుకుంటారు. అదే మహిళల విషయానికి వస్తే.. మాత్రం.. నేటికి కూడా రెండో పెళ్లి చేసుకునే వారిని వింతగా చూస్తుంటారు. భర్త నుంచి విడిపోవడమో, అతడు మరణించడమో జరిగితే.. ఇక ఆమె కచ్చితంగా అలా ఒంటరిగా ఉండాల్సిందే తప్ప.. పెళ్లి చేసుకోవడం, సంతోషంగా ఉండటం వంటివి చేయకూడదు అని భావిస్తారు సమాజంలో చాలా మంది. పిల్లలే లోకంగా బతకాలి. అయితే మారుతున్న కాలంతో పాటు ఈ ఆలోచన ధోరణి కూడా మారుతుంది. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా రెండో సారి వివాహం చేసుకుంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ మరో ఆహ్వానించదగ్గ పరిణామం ఏంటంటే.. సదరు మహిళకు కుటుంబం, పిల్లల మద్దతు పూర్తిగా లభిస్తోంది. చాలా సందర్భాల్లో పిల్లలే దగ్గరుండి తల్లికి రెండో వివాహం చేస్తున్నారు.
భర్తకు దూరమయ్యి.. ఒంటరిగా పిల్లలే లోకంగా బతికే తల్లి.. బిడ్డల కోసం ఎన్ని త్యాగాలు చేస్తుందో.. చిన్నప్పటి నుంచి స్వయంగా చూస్తూ పెరిగిన పిల్లలు.. కనీసం ఇప్పటికైనా తల్లికి ఓ తోడు కావాలని భావిస్తున్నారు. కొన్ని చోట్ల వాళ్లే సంబంధం వెతుకుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. 20 ఏళ్ల క్రితం విడాకులు తీసుకుని భర్త నుంచి దూరమయ్యి.. ఒంటరిగా బిడ్డ బాగోగులు చూసిన తల్లికి.. కుమార్తె స్వయంగా దగ్గరుండి రెండో వివాహం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
ఈ సంఘటన అస్సాంలో చోటు చేసుకుంది. నిర్మలీ అనే మహిళ 20 ఏళ్ల వయసులో తన కుమార్తెతో పాటు.. అత్తింటి నుంచి బయటకు వచ్చేసింది. భర్త నుంచి విడిపోయి ఒంటరిగా బతకాల్సిన పరిస్థితి. తనతో పాటు కుమార్తెను బతికించాలంటే.. మంచి చదువు అవసరం. దాంతో బిడ్డను తల్లిదండ్రుల దగ్గర వదిలి హాస్టల్లో ఉండి.. ఉన్నత విద్యను పూర్తి చేసింది. మంచి ఉద్యోగం సంపాదించుకుని.. కుమార్తె దగ్గరకు తిరిగి వచ్చింది నిర్మలీ. అప్పటి నుంచి కుమార్తె బాగోగులు తనే చూసుకునేది. బిడ్డకు తల్లి,తండ్రి తానే అయ్యింది నిర్మలీ. బిడ్డకు మంచి విద్యాబుద్ధులు నేర్పించింది. ప్రస్తుతం ఆమె ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. ఇక నిర్మలీకి బైక్ నడపడం అంటే చాలా ఇష్టం. అలాంటి ఒక ప్రయాణంలోనే ఆమె తనకు కాబోయే జీవిత భాగస్వామిని కలిశారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే వివాహం చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడానికి తనకు చాలా సమయం పట్టింది అన్నారు నిర్మలీ. మొదటి సారి చోటు చేసుకున్న అనుభవాల దృష్ట్యా రెండో పెళ్లి వద్దు.. ఇలానే ఒంటరిగా నాకు నచ్చినట్లుగా బతకాలని అనుకున్నాను. కానీ నా భర్త, అతడి కుటుంబ సభ్యులు మా ఇంటికి వచ్చి నాతల్లిదండ్రులను ఒప్పించారు. దాంతో వారి మంచితనం అర్థం అయ్యి పెళ్లికి సిద్ధపడ్డాను. ఇక ‘‘నా కూతురు ఈ పెళ్లికి ఒప్పుకోవడం చాలా ముఖ్యం. తను అమెరికాలో స్థిరపడింది. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తనకు చెప్పాను. ఆ విషయం విషయం విని తను చాలా సంతోషించింది’ అని చెప్పారు నిర్మలీ. అనంతరం ఆమె కూతురు ప్రియాంక అమెరికా నుంచి భారత్ వచ్చి తల్లికి దగ్గరుండి పెళ్లి చేశారు. ప్రసుత్తం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.