పోలీసు శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫిట్నెస్ విషయంలో తగ్గేదేలే అంటూ డెసిజన్ తీసుకుంది.
సమాజంలో పోలీసులకు ఎంత గౌరవం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజల భద్రత కోసం అనునిత్యం కష్టపడే పోలీసులను చాలా మంది స్ఫూర్తిగా తీసుకుంటారు. వారిలాగే తాము కూడా పోలీసులమై ప్రజలకు సేవ చేయాలని అనుకుంటారు. ఇలా పోలీసులను ఇన్స్పిరేషన్గా తీసుకొని జీవితంలో ఎదిగిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే పోలీసింగ్ ఒకప్పటిలా లేదు. పోలీసు వ్యవస్థలో ఇప్పుడు అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాలం మారింది, దొంగతనాలు, దోపిడీలు చేసే తీరులో కూడా ఎంతో మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో వాటిని అరికట్టేందుకు పోలీసులకు ఆ విషయాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. ఇంకా మరెన్నో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.
అస్సాం ప్రభుత్వం కూడా ఆ రాష్ట్ర పోలీసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మామూలుగా ఉద్యోగాల్లో చేరే సమయంలో ఫిట్‌గా ఉండే పోలీసులు.. ఆ తర్వాత పని ఒత్తిడి లేదా వ్యాయామం లేకపోవడం వల్లో కాస్త బొద్దుగా తయారవుతున్నారు. దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులు ఫిట్‌గా ఉండకపోతే ఎలా అని అనుకుంది అస్సాం సర్కార్. ఫిట్‌గా మారాల్సిందేనని పోలీసులకు అల్టిమేటం ఇచ్చింది. ప్రతి పోలీసు కూడా ఫిట్‌గా మారాలని.. అందుకు ఆగస్టు 15ను డెడ్‌లైన్‌గా విధించింది. ఒకవేళ నిర్ణీత తేదీలోగా ఫిట్‌గా మారకపోతే వీఆర్ఎస్ తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అస్సాం డీజీపీ జీపీ సింగ్ ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు 16 నుంచి ఉద్యోగుల బీఎంఐ లెక్కిస్తామని సింగ్ తెలిపారు. ఇకపోతే, ఫిట్‌గా లేని పోలీసులను తీసేస్తామని రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ హెచ్చరించిన విషయం విదితమే.