దేశం కోసం నిత్యం వేలాది మంది సైనికులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రేయింబవళ్లు విధులు నిర్వహిస్తుంటారు. మృత్యువు తమ వెంటే ఉందని తెలుసు..కానీ ఎటువైపు నుంచి వస్తుందోనని భయపడక సరిహద్దుల్లో సైనికులు మనకు రక్షణగా ఉంటారు. సైనికుల వీరోచిత పోరాటల గురించి మనం చరిత్రలో అనేక కథలు విని ఉంటాము. దేశ రక్షణ కోసం ఎందరో తమ ప్రాణాలను అర్పించారు. అయితే దేశం కోసం కేవలం సైనికులు, అధికారులే కాదు.. జాగిలాలు కూడా ప్రాణాలు లెక్కచేయకుండా పోరాటం చేస్తుంటాయి. బాంబులను నిర్వీర్యం చేసే సమయంలో పేలుడు సంభవించి జాగీలాలు మరణించి ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో తీవ్రంగా గాయపడిన జూమ్ అనే జాగిలం మృతి చెందింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే..
ఆదివారం జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని తంగపావా ప్రాంతంలో లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో వారినీ పట్టుకునేందుకు ఆ ప్రాంతానికి సైనికులు వెళ్లారు. వారిని పట్టుకునేందుకు ఆర్మీ జాగీలం ‘జూమ్’ ను కూడా తమ వెంట తీసుకెళ్లారు. వారిని గుర్తించే బాధ్యతను సైనికులు జూమ్ కి అప్పగించారు. ఈక్రమంలో ఉగ్రవాదులు దాక్కున ఇంట్లోకి జూమ్ ను పంపారు. ముస్కరులను గుర్తించిన జూమ్ వెంటనే వారిపై దాడి చేసింది. అక్కడే దాక్కున్న ఓ ఉగ్రవాది జూమ్ పై కాల్పులు జరిపాడు. దీంతో ఆ జాగీలం తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలోనే ఇంట్లోకి వెళ్లిన సైనికులు కూడా ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులకు, జవాన్లకి మధ్య తీవ్ర స్థాయిలో కాల్పు జరిగాయి.
ఈక్రమంలోనే జూమ్ శరీరంలోకి తూటాలు దూసుకెళ్లాయి. శరీరంలోకి తూటాలు వెళ్లినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాడింది. ఓ వైపు శరీరం నుంచి రక్తం కారుతున్నా.. జూమ్ మాత్రం ఉగ్రవాదులపై దాడిని ఆపలేదు. సైనికులతో పాటు జూమ్ కూడా ఉగ్రవాదులపై దాడి చేసింది. చివరకు జూమ్ సాయంతో జవాన్లు.. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. అయితే ఈ ఎన్ కౌంటర్ లో తీవ్రంగా గాయపడిన జూమ్ ను శ్రీనగర్ లోని ఆర్మీ వెటర్నరీ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ జూమ్ గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు వెల్లడించారు.