జైజవాన్.. జై కిసాన్.. దేశానికి అన్నం పెట్టే రైతు తర్వాత అంతా పూజించేంది, గౌరవించేది సైనికుడినే. జవాన్లు దేశం కోసం, దేశ ప్రజల కోసం తమ కుటుంబాన్ని, అయిన వారిని వదిలి సరిహద్దుల్లో పహరా కాస్తుంటారు. అక్కడ వాళ్లు ప్రాణాలకు తెగించి కాపలా కాయబట్టే.. ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. అలాంటి బాధ్యత గల ఉద్యోగాన్ని ఎంచుకోవాలి అంటే తెగువ కావాలి. అదే అమ్మాయికి అయితే గుండె ధైర్యంతో పాటు కుటుంబం నుంచి సపోర్ట్ కూడా కావాలి. ఎన్నో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మంచి ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి ఆర్మీ ట్రైనింగ్ కు వెళ్లింది. కొన్ని ఎదురుదెబ్బల తర్వాత నిలదొక్కుని ఆర్మీ ఆఫీసర్ గా మారింది. ఆ యువతి జీవితంలో పడిన కష్టాలు, ఎదుర్కొన్న పరిస్థితులపై ఇన్‌స్పిరేషనల్ స్టోరీ మీకోసం..
ఆమె పేరు శరణ్య.. ఊరు తమిళనాడు ఈరోడు జిల్లాలోని అందియూరు సమీపంలో ఉన్న నంజమడైకుట్టై. నిజానికి దానిని ఊరు అనేకంటే కొండల నడుమ పచ్చటి ప్రకృతి సిగలో ఉన్న తండా అని చెప్పొచ్చు. అక్కడ జనాభా కూడా తక్కువే. ఇంక రోడ్డు, రవాణా సౌకర్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శరణ్య చదువుకోవడానికి బడికి వెళ్లాలంటే రోజుకు రెండు గంటల ప్రయాణం చేయాల్సిందే.
ఆ ఊరిలో దాదాపు అంతా పశువుల పెంపకం మీదే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. శరణ్య వాళ్లది కూడా పశువుల పెంపకమే జీవనోపాధిగా జీవించే కుటుంబం. శరణ్యకు చదువంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇంట్లో అన్ని పనుల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేది. ఆమెకు కబడ్డీ అన్నా కూడా చాలా ఇష్టం. శరణ్యకు ఆమె తల్లిదండ్రులు కెరీర్ కు సంబంధించి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. కాలేజీకి వెళ్లినా కబడ్డీ ఆటను వదల్లేదు. ఓసారి అన్నా వర్సిటీ తరఫున ఆడే అవకాశం లభించింది. వాళ్లే శరణ్యను సివిలి ఇంజినీరింగ్ కూడా చదివించారు.
సివిల్ ఇంజినీరింగ్ తర్వాత కాగ్నిజెంట్ లో మంచి ఉద్యోగం వచ్చింది. కానీ, శరణ్యకు జీవితంలో ఏదో కోల్పోయిన భావన పెరిగింది. అదేంటంటే.. ఆమెకు ఉద్యోగంలో చేరిన తర్వాత కబడ్డీ ఆడే అవకాశం దొరకలేదు. ఆ వెలితితో చివరకు ఉద్యోగాన్నే వదిలేసేందుకు సిద్ధమైపోయింది. అదే విషయం ఇంట్లో చెప్పగా.. తల్లిందండ్రులు కూడా ఆమె మాటకు ఎదురు చెప్పలేదు. అప్పుడున్న పరిస్థితిలో వారికి ఆర్థికంగా ఎంతో కొంత సపోర్ట్ కావాలి.. కానీ, కూమార్తె కోరికను కాదనలేక పోయారు.
కబడ్డీ మీదున్న ప్యాషన్ తో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత ఆమె దృష్టి మొత్తం మిలటరీ వైపు మళ్లింది. ఎలాగైనా ఆర్మీలో చేరాలని గట్టిగా కోరుకుంది. కానీ, ఆ ఊరిలో ఎవరూ ఆర్మీలో చేరిన వాళ్లు లేరు.. ఎలా అప్లై చేసుకోవాలి ఏం చేయాలి అనే వివరాలు ఏమీ తెలియవు. ఎంతో మందిని ఆర్మీ గురించి వివరాలు అడిగి తెలుసుకుంది. గతేడాది జూన్ లో సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షలు రాసింది. శిక్షణ పొందేందుకు కోవైలోని ఓ ప్రైవేటు కాడమీలో కూడా చేరింది.
అక్కడ రకరకాల టెస్టులు పెట్టేవారు.. రోజూ 3 నిమిషాలు ఇంగ్లీష్ లో మాట్లాడి వీడియో పెట్టాలని చెప్పేవారు. కొత్తలో 3 నిమిషాల వీడియో కోసం రోజుకు 50 టేకులు తీసుకునేది. శరణ్యకు ఇంగ్లీష్ మీద పట్టులేకపోవడం.. ఎంతకీ ఆమె పుంజుకోవడం లేదని అకాడమీ నుంచి తీసేశారు. ఆ తర్వాత 3 నెలలు కృషి చేసి తిరిగి అకాడమీలో చేరింది. కోచ్ లెఫ్టినెంట్ ఈసన్ ఇచ్చిన శిక్షణతోనే తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపింది. అలా తిరిగి ఆర్మీ అకాడమీలో చేరడమే కాకుండా.. అఫీసర్ గా ఉద్యోగం కూడా సంపాదించింది.
శరణ్య చేరే సమయంలో 190 మంది అలహాబాద్ లో రిపోర్ట్ చేస్తే.. అందులో కేవలం 26 మంది మాత్రమే స్క్రీన్ ఇన్ అయ్యారు. మళ్లీ వారిలో కేవలం ఐదుగురు మాత్రమే ఉద్యోగానికి ఎంపిక అయ్యారు. ఆ ఐదుగిరిలో ముగ్గురు సైనిక కుటుంబాలకు చెందిన వారే. ఆ బ్యాచ్ లో మారుమూల కుగ్రామం నుంచి వచ్చి.. ఆర్మీ ఆఫీసర్ గా ఉద్యోగం సంపాదించింది కేవలం శరణ్య మాత్రమే. ప్రస్తుతం శరణ్య సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్ గా మారింది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం చూసి ఎంతో మంది మెచ్చుకుంటున్నారు. శరణ్య సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.