భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జంతు ప్రదర్శనశాలలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్న ఓ అనకొండ ఏకంగా తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అరుదైన పసుపు వర్ణంలో ఉన్న ఈ తొమ్మిది పిల్లలను జూ కీపర్లు పరిరక్షిస్తున్నారు. ఇక రాష్ట్రంలో అనకొండకు పిల్లలు జన్మించడం ఇదే తొలిసారి. నందన్‌కానన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
2019లో చెన్నైలోని మొసళ్ల పార్కు నుంచి ఎనిమిది అరుదైన పసుపు రంగు అనకొండలను నందన్‌కానన్ జూకు అధికారులు తీసుకు వచ్చారు. ప్రస్తుతం జంతుప్రదర్శనశాలలో ఈ అరుదైన పాములు సందర్శకులకు ఎంతో కనువిందు చేస్తున్నాయి. సాధారణంగా పాములు సంచరించడానికి కావాసిన వాతావరణం అంటే రాళ్లు, గుహలు, ప్రత్యేకమైన చెట్ల సదుపాయం ఇక్కడ ఏర్పాటు చేశారు జూ అధికారులు.
అనకొండలను నందన్‌కానన్ జూకు తీసుకు వచ్చిన తర్వాత ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ సంస్థ.. జూ అధికారులు కలిసి ఈ అరుదైన రంగు అనకొంల సంతతి పెంచేందుకు ప్రయోగాలు మొదలు పెట్టారు. తాజాగా ఆ ప్రయత్నం ఫలించిందని తెలిపారు.
ఇక గురువారం అనకొండ ఓ పిల్లకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తల్లి అనకొండకు కడుపు లావుగా ఉండటంతో దాని పొట్టలో మరిన్ని పిల్లలు ఉన్నట్లు గుర్తించి వాటిని సురక్షితంగా తీశారు. మొత్తానికి తొమ్మిది పిల్లలు జన్మించగా అందులో ఒకటి చనిపోయింది. ఆ తర్వాత చెన్నై నుంచి తీసుకు వచ్చిన వాటిలో మూడు చనిపోయాయి. ప్రస్తుతం అనకొండ పిల్లలకు సంబంధించిన ఫోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.