జయంతి, వర్ధంతి వేడుకలు జరపడం అనేది ఎక్కడైనా సర్వసాధారణమే. చనిపోయిన వారి పుట్టినరోజును జయంతిగా, మరణించిన రోజును వర్ధంతిగా జరుపుకోవడం కామనే. ఇక, వర్ధంతి రోజు కుటుంబ సభ్యులు, ఆప్తులు, మరికొందరు సన్నిహితులు.. మరణించిన వారి పేరిట పండ్లు, బట్టలను పేదలకు పంచుతుంటారు. చనిపోయిన వారితో తాము గడిపిన క్షణాలు, తమ జీవితాల్లో వారు పోషించిన పాత్రను గుర్తు తెచ్చుకుంటారు. వాళ్లు లేని లోటు, జీవితం గడుస్తున్న తీరును తలచుకుని కొందరు బాధపడుతుంటారు.
]పంజాబ్‌కు చెందిన ఓ వృద్ధుడు మాత్రం బతికుండగానే తన వర్ధంతిని జరుపుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. వర్ధంతి వేడుకలకు వృద్ధుడి కుటుంబ సభ్యులు కూడా అండగా నిలబడటం. పంజాబ్ రాష్ట్రం, ఫతేగడ్ సాహిబ్ జిల్లాలోని మజ్రి సోధియా గ్రామానికి చెందిన భజన్ సింగ్ అనే వ్యక్తి వృత్తిరీత్యా ఒక మిల్లులో పని చేస్తున్నారు. గత ఐదేళ్లుగా ఆయన తన వర్ధంతి వేడుకలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కొందరు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం, అలాగే కొంతమంది బాలికలకు భోజనాలు పెట్టడం లాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.
వర్ధంతిని జరుపుకోవడంపై భజన్ సింగ్ స్పందిస్తూ.. దానధర్మాలు చేయడం అంటే తనకు చాలా ఇష్టం అన్నారు. బతికుండగానే దానం చేయాలని.. అప్పుడే తన మనసుకు సంతృప్తి అని ఆయన పేర్కొన్నారు. ఈ కలియుగంలో దానధర్మాలు చేసేవారు తక్కువైపోయారని.. ప్రస్తుత సమాజాన్ని అప్రమత్తం చేయడమే తన లక్ష్యమని భజన్ సింగ్ వివరించారు. మరి, ఆ వృద్ధుడు ఇలా బతికుండగానే తన వర్ధంతి చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.