అత్త మీద కోపం దుత్త మీద తీర్చినట్లు..ఓ భర్త భార్యపై తీర్చుకోలేని కోపాన్ని ఏకంగా పోలీసుల మీదే చూపించాడు. పోలీసుల మీద తీర్చుకోవటమేంటి అని అనుకుంటున్నారా..? అవును..మీరు విన్నది నూటికి నూరు పాళ్లు నిజం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..అది గుజరాత్ లోని జామ్ నగర్ సమీపంలో భజరంగ్ వాడి ప్రాంతం. ఇదే గ్రామంలో భార్యతో పాటు నివాసముంటున్నాడు దేవ్ జీ అనే భర్త. కొన్నాళ్లు వీళ్ల కాపురం సాఫీగానే సాగింది. కాని కొంత కాలం తర్వాత ఇద్దరి మధ్య మాట మాట పెరిగి భార్యాభర్తల కాస్త గ్యాప్ పెరిగింది.
దీంతో భార్య భర్తపై కోపాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇద్దరి మధ్య పెరిగిన కోపంతో తన భర్తకు తిండికూడా పెట్టలేదట. సమయానికి భోజనం పెట్టకపోవటంతో భర్త అగ్గిమీద గుగ్గులం అయ్యాడు. కానీ భర్త తన కోపాన్ని భార్యపై చూపించలేక సతమతమయ్యేవాడు. ఇక మాములుగా కొందరు భర్తలు భార్యలపై కోపంతో కొట్టడమో, తిట్టడమో చేస్తారు. కానీ మనోడు మాత్రం అదే కోపాన్ని పోలీసు అవుట్ పోస్ట్ మీద చూపించి పోలీసులకు చుక్కలు చూపించాడు.
స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అవుట్ పోస్ట్ చేరుకున్నాడు. దీంతో వెంటనే పెట్రోల్ తీసుకుని ఏకంగా పరుగులు మొదలుపెట్టాడు. ఏంటా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పక్కనే ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ పై పెట్రోల్ పోసి నిప్పంటించి పక్కనే కూర్చున్నాడు. దీంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. ఇక వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కాలిపోతున్న పోలీస్ అవుట్ పోస్ట్ పై నీళ్లు చల్లి కాస్త మంటలను ఆర్పివేశారు. దీనికి కారకులైన వారిని పోలీసులు వెతుకుతుండటంతో కొందరు స్థానికులు ఇదిగో..ఇతనే నిప్పుపెట్టిందని మనోడి వంక చూపించారు.
దీంతో వెంటనే మనోడిని మందలించే సరికి అసలు విషయాలు బయట పెట్టేశాడు. తన భార్య సమాయానికి భోజనం సరిగ్గా పెట్టడం లేదని, పోలీస్ అవుట్ పోస్ట్ కి నిప్పుపెడితే నన్ను జైల్లో పెట్టి కనీసం మీరైన అన్నం పెడతారనే ఉద్దేశంతో ఇలా నిప్పుపెట్టానని తెలిపాడు. దీంతో మనోడి సమాధానంతో పోలీసులు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఇలా అత్తమీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు మనోడి విన్నూత్న ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.