దేశంలో అరగంటకు ఒకరు కుక్క కాటుతో చనిపోతున్నారనే సర్వేలు నిజమని నిరూపితమౌతున్నాయి. ఈ కుక్కల దాడికి అనేక మంది బాధితులవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల అనేక మంది చిన్నారులు వీధి కుక్కల దాడిలో మృతి చెందారు. తాజాగా మరో బాలుడు అత్యంత ఘోరంగా కుక్కలకు బలయ్యాడు.
చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల వెనుక కుక్కలతో జాగ్రత్త, కుక్కల జోలికి వెళ్లకూడదు అని ప్రభుత్వం సూచనలు చేసేది. అయితే ఇప్పుడు ఈ సూచనలు తప్పనిసరి అనిపిస్తోంది. ఎందుకంటే దేశంలో రోజు రోజుకు వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ కుక్కల దాడిలో అనేక మంది బాధితులయ్యారు.. అవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు వీధి కుక్కల దాడిలో మరణించారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో మృతి చెందిన దారుణ ఘటన ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే. అదే విధంగా ఖమ్మం జిల్లాలో వీధి కుక్కల దాడిలో 5 ఏళ్ల చిన్నారి భరత్ ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా మరో ప్రాంతంలో ఘోరం జరిగింది. 11 ఏళ్ల బాలుడిని అత్యంత జుగుప్పకరంగా వీధి కుక్కలు దాడి చేశాయి.
11 ఏళ్ల బాలుడు ఆదర్శ్ శర్మను వీధి కుక్కలు ఘోరంగా పీక్కుతిన్నాయి. ఒళ్లు గగొర్పొడిచే ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో మహరాజ్‌గంజ్ పట్టణంలో శాస్త్రి నగర్ ఇంటర్మీడియట్ కళాశాల మైదానంలో చోటుచేసుకుంది. ఈ నెల 10న మార్కెట్‌కి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆదర్శ్‌ను వీధి కుక్కలు వెంబడించాయి. ఒక్కసారిగా దాడి చేయడంతో కంగారు పడ్డ బాలుడు.. వాటితో పోరాటం చేశాడు. అయినప్పటికీ అవి వదల్లేదు. తీవ్రంగా గాయపరిచి చంపేశాయి. అనంతర శరీర భాగాలను పీక్కుతిన్నాయి. అయితే బాబు కనిపించకపోవడంతో.. తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఆచూకీ దొరక్కపోవడంతో కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకి కోసం గాలించిన పోలీసులకు మృతదేహం కనిపించిందన్న సమాచారం అందింది.
తీరా వెళ్లి చూడగా.. ముఖం, కుడి చేయిని కుక్కలు తీవ్రంగా పీక్కుతిన్న దృశ్యాలు కనిపించాయి. బాలుడ్ని ఆస్థితిలో చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. నెహ్రూ నగర్ వార్డులో పాక్షిక శరీర అవయవాలతో ఆదర్శ్ శర్మ మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. అనంతరం తమకు సమాచారం అందించారని కొత్వాలి పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జి రవి రాయ్ తెలిపారు. అతని ముఖం, కుడి చేయి కొరికిందని, బాధితుడు కుక్కలతో పోరాడినట్లు కనిపించిందని తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్షకు తరలించామని, పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారని ఆయన తెలిపారు. బాలుడి మరణవార్త స్థానికంగా పెను సంచలనమైంది. పోలీసులు, జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.వీధి కుక్కల బెడదను అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్నారు.