గుజరాత్ లో ఎన్నికల సమీపిస్తున్న వేళ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్, నెహ్రూ కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా విరుచుక పడుతున్నారు. తాజాగా హోం మంత్రి అమిషా మరోసారి నెహ్రూ కుటుంబపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సమస్యకు ప్రధాన కారకులు దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రుయే అని అమిత్ షా ఆరోపించారు. ఆర్టికల్-370ని రాజ్యాంగంలో నెహ్రూ చేర్చడం వల్లే కశ్మీర్ సమస్య వచ్చిందని అమిత్ షా అన్నారు. అయితే 370 ఆర్టికల్ ను రద్దు చేయడం ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించిన ఘనత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కిందన్నారు. గుజరాత్ లో జరిగిన భాజపా మీటింగ్ లో అమిత్ షా కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు.
గుజరాత్ లో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికల హడవుడిలో బిజిబిజీగా గడుపుతున్నాయి. సభలు, సమావేశాలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. గురువారం అహ్మదాబాద్ జిల్లా జంజర్కా, ఉనాయ్ లో గౌరవ్ యాత్రను బీజేపీ ప్రారంభించింది. ఈ యాత్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై, నెహ్రూ కుటుంబపై నిప్పులు చెరిగారు. అమిత్ షా మాట్లాడుతూ… “కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్-370ను నెహ్రూ రాజ్యాంగంలో చేర్చారు. ఆయన చేసిన ఆ తప్పిందం వల్లే కశ్మీర్ పెద్ద సమస్యగా మారింది. ఆ ప్రాంతం దేశంతో పూర్తిగా విలీనం కాలేదు. దీంతో దేశంలోని ప్రజలందరూ ఆర్టికల్-370ను రద్దు చేయాలని కోరుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఏ ప్రధాని ఆ సాహం చేయలేకపోయారు. కానీ ప్రస్తుత ప్రధాని మోదీ 2019లో ఒక్క వేటుతో ఆర్టికల్-370ను రద్దు చేసి, కశ్మీర్ ను పూర్తీ గా దేశంలో విలీనం చేశారు” అని అమిత్ షా తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసినప్పటికీ అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. సీమాంతర ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యహవరించిందని అంటూ 2016 సర్జికల్ స్ట్రైక్, 2019లో ఎయిర్ స్ట్రైక్ ను ఆయన ప్రస్తావించారు. ‘గతంలో యూపీఏ హాయంలో పాక్ సైనికులు ఇండియన్ ఆర్మీపై తెగదాడులకు పాల్పడే వారు. మన సైనికుల తలలను నరికి, వెంట తీసుకెళ్లింది. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చాక కూడా పాక్ ఆర్మీ అలాగే చేయాలని చూసింది. కానీ ఇది మౌని బాబా ప్రభుత్వం కాదన్న విషయం వాళ్లు మరిచారు. సర్జీకల్ స్ట్రైక్స్ ,ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా ఉగ్రవాదులకు మోదీ ప్రభుత్వం గుణపాఠం చెప్పింది. దేశానికి భద్రత కల్పించడం, దేశాన్ని అభివృద్ది చేసే సామర్ధ్యం కాంగ్రెస్ కు లేదు”అని అమిత్ షా విమర్శించారు.